హైదరాబాద్‌‌‌‌ లో పాడ్ టాక్సీలు ..పీపీపీ పద్ధతిలో అమలు చేసేందుకు ఫీజిబిలిటీ స్టడీ పూర్తి

హైదరాబాద్‌‌‌‌ లో పాడ్ టాక్సీలు ..పీపీపీ పద్ధతిలో అమలు చేసేందుకు ఫీజిబిలిటీ స్టడీ పూర్తి
  • సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఆదేశాలతో రంగంలోకి మెట్రో రైల్ లిమిటెడ్
  • రాయదుర్గం–కూకట్‌‌‌‌పల్లి, సెక్రటేరియెట్–సికింద్రాబాద్ ఏరియాల్లో రూట్లు
  • పలు శాఖల అధికారులు, కంపెనీల ప్రతినిధులతో హెచ్‌‌‌‌ఎంఆర్‌‌‌‌ఎల్ వర్క్‌‌‌‌షాప్

 హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలో మెట్రో రైలు దిగి ఆఫీసులు, ఇండ్లకు వెళ్లడానికి ప్యాసింజర్లు పడుతున్న తిప్పలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కొత్తగా ‘పాడ్ టాక్సీ’లను తీసుకురావాలని చూస్తోంది. మెట్రో దిగిన ప్రయాణికులను సులువుగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌‌‌‌ఎంఆర్‌‌‌‌ఎల్) ఈ దిశగా అడుగులు వేస్తోంది. పీపీపీ విధానంలో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(పీఆర్‌‌‌‌టీఎస్) పేరుతో పాడ్ టాక్సీల ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తోంది.

ఈ ప్రాజెక్టును సిటీలో అమలు చేయవచ్చా లేదా అని నిర్వహించిన సర్వే రిపోర్టుపై అందరి అభిప్రాయాలు, సలహాలు తెలుసుకునేందుకు అధికారులు మంగళవారం నగరంలో వర్క్‌‌‌‌షాప్ నిర్వహించారు. హెచ్‌‌‌‌ఎంఆర్‌‌‌‌ఎల్, అధ్యయనాన్ని పూర్తి చేసిన ‘లీ అసోసియేట్స్’ సంస్థ కలిసి సదస్సును ఏర్పాటు చేశాయి.

పాడ్ టాక్సీ సిస్టమ్ ఏంటంటే...

పాడ్ టాక్సీ అనేది ఒక చిన్నపాటి కారు లాంటి క్యాప్సూల్ వాహనం. దీనికి డ్రైవర్ ఉండడు, పూర్తిగా కరెంట్‌‌‌‌తోనే నడుస్తుంది. ఇందులో ఒకేసారి నలుగురు లేదా ఆరుగురు మాత్రమే కూర్చునే వీలుంటుంది. రోడ్లపై ఉండే ట్రాఫిక్‌‌‌‌తో ఏమాత్రం సంబంధం లేకుండా, గాల్లో ప్రత్యేకంగా పిల్లర్లు వేసి నిర్మించే చిన్న ట్రాక్‌‌‌‌ల మీద ఇవి కంప్యూటర్ సాయంతో వాటంతట అవే ప్రయాణిస్తాయి. మామూలు ఆర్టీసీ బస్సులు లేదా లోకల్ రైళ్లలాగా ఇవి మధ్యలో ప్రతి స్టాప్‌‌‌‌లో ఆగవు. మనం పాడ్ ఎక్కిన చోటు నుంచి నేరుగా మనం వెళ్లాల్సిన స్టాప్‌‌‌‌కు నాన్‌‌‌‌స్టాప్‌‌‌‌గా వెళ్లిపోవచ్చు. ఎక్కడా ఆగకుండా వేగంగా, కాలుష్యం లేకుండా గమ్యానికి చేర్చడం వీటి ప్రత్యేకత. మెట్రో రైలు దిగిన వెంటనే క్యాబ్‌‌‌‌లు, ఆటోల కోసం ఎదురుచూడకుండా, గంటల తరబడి ట్రాఫిక్‌‌‌‌లో ఇరుక్కోకుండా ఐటీ కంపెనీలు, కాలనీలకు చేరుకోవడానికి పాడ్ టాక్సీలు  ఉపయోగపడతాయి. నగరంలో మెట్రో ప్రయాణికుల రవాణా కష్టాలను తీర్చడానికి సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఆదేశాల మేరకు పాడ్ టాక్సీల ఏర్పాటుపై హెచ్‌‌‌‌ఎంఆర్‌‌‌‌ఎల్ సర్వే నిర్వహించిందని హెచ్‌‌‌‌ఎంఆర్‌‌‌‌ఎల్ ఎండీ సర్ఫరాజ్ తెలిపారు. ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే నగరంలో ట్రాఫిక్ జామ్‌‌‌‌లు తగ్గి, మెట్రో ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.

ఏయే రూట్లలో నడుపుతారంటే...

ఈ ప్రాజెక్టుపై అధ్యయనం చేసిన లీ అసోసియేట్స్ డైరెక్టర్ బీఎం సెట్టి ప్రజెంటేషన్ ద్వారా రూట్ల వివరాలను వివరించారు. మెట్రో, సిటీ బస్సులతో పోలిస్తే పాడ్ టాక్సీల వల్ల కలిగే లాభాలను ఆయన చూపించారు. నగరంలో ప్రస్తుతం రెండు ప్రధాన ప్రాంతాలను ఎంపిక చేసి అధ్యయనం చేసినట్లు వెల్లడించారు. ఇందులో మొదటి ప్రాంతం రాయదుర్గం నుంచి కూకట్‌‌‌‌పల్లి వరకు ఉన్న కారిడార్. ఇందులో రాయదుర్గం, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లతో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసర ప్రాంతాలు ఉన్నాయి. ఇక రెండో ప్రాంతం రాష్ట్ర సెక్రటేరియెట్, హుస్సేన్ సాగర్, బేగంపేట్, అసెంబ్లీ, సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాలు. ఈ మార్గాల్లో రోజుకు ఎంతమంది ప్రయాణించే అవకాశం ఉంది, పాడ్ టాక్సీల కోసం డిపోలను ఎక్కడెక్కడ కట్టాలి, రూట్ల నిర్మాణంలో రోడ్ల మీద ఎలాంటి సమస్యలు వస్తాయి అనే అంశాలను ఆయన వివరించారు.

సలహాలు, సూచనల స్వీకరణ...

మెట్రో స్టేషన్ల నుంచి చివరి గమ్యస్థానానికి ప్రయాణికులు చేరేందుకు పాడ్ టాక్సీలు మేలు చేస్తాయని అర్బన్ ట్రాన్స్పోర్ట్, మెట్రో సలహాదారు ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. హెచ్‌‌‌‌ఎంఆర్‌‌‌‌ఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ బి. ఆనంద్ మోహన్ సమావేశాన్ని నడిపిస్తూ అధికారులు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చారు. సదస్సులో సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ సన్‌‌‌‌ప్రీత్ సింగ్, డీసీపీ రాహుల్ హెగ్డే, ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ కె.వి.బి. రెడ్డితో పాటు హెచ్‌‌‌‌ఎంఆర్‌‌‌‌ఎల్ ఇంజనీర్లు డి.వి.ఎస్. రాజు, ఎస్.కె. దాస్, ఎస్. భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ శాఖలైన హెచ్‌‌‌‌ఎండీఏ, జీహెచ్‌‌‌‌ఎంసీ, ట్రాఫిక్ పోలీస్, ఆర్టీసీ, విద్యుత్ శాఖ, రైల్వే, కలెక్టరేట్ అధికారులతో పాటు రహేజా, మీనాక్షి, సాలార్‌‌‌‌ పురియా, నెక్సస్ మాల్, టెక్ మహీంద్రా వంటి ప్రముఖ నిర్మాణ, ఐటీ సంస్థల ప్రతినిధులు, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు పాల్గొని ప్రాజెక్టుపై సలహాలు ఇచ్చారు.