ఆన్‌లైన్‌లో లిక్కర్ రిజర్వేషన్.. మందు బాబులకు ఢిల్లీలో కొత్త సర్వీస్

ఆన్‌లైన్‌లో లిక్కర్ రిజర్వేషన్.. మందు బాబులకు ఢిల్లీలో కొత్త సర్వీస్

ఢిల్లీలో పండుగ సమయాల్లో మద్యం షాపుల వద్ద కనిపించే రద్దీకి చెక్ పెట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఢిల్లీ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (DSIIDC) 'ఢిల్లీ లిక్కర్ బుకింగ్' యాప్‌ను ప్రారంభించింది. దీని ద్వారా వినియోగదారులు ఆన్‌లైన్‌లోనే తమకు నచ్చిన బ్రాండ్‌లను ముందే బుక్ చేసుకోవచ్చు.

ఈ విధానం ద్వారా ఇంట్లోనే కూర్చుని మద్యం ఆర్డర్ చేసి డెలివరీ పొందలేమనే విషయం గమనించాలి. ఇది కేవలం ఆన్‌లైన్ రిజర్వేషన్, ముందస్తు చెల్లింపుల సేవ మాత్రమే. యాప్ ద్వారా పేమెంట్ చేసిన తర్వాత వినియోగదారునికి ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ వస్తుంది.

ఈ సర్వీస్ ప్రస్తుతం అన్ని ప్రభుత్వ దుకాణాల్లో కాకుండా, కేవలం DSIIDC పరిధిలోని 208 ఆథరైజ్డ్ అవుట్‌లెట్లలో మాత్రమే అందుబాటులో ఉంది. వినియోగదారులు తమకు నచ్చిన షాపును ఎంచుకుని, ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. బుకింగ్ చేసుకున్న తర్వాత 48 గంటలలోపు సంబంధిత ఔట్‌లెట్‌కు నేరుగా వెళ్లాలి. అక్కడ ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయించి.. ఆర్డర్‌ను స్వయంగా కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 

ALSO READ : ఇక నుంచి రాత్రి పూట రైళ్లల్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ బంద్ !

ఈ యాప్‌ను ఉపయోగించాలంటే కనీస వయస్సు 25 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి గరిష్టంగా 9 లీటర్ల విస్కీ, 18 లీటర్ల బీర్ వరకు కొనుగోలు చేయడానికి అనుమతి ఉంది ఆన్‌లైన్ పద్ధతిలో. ఒకసారి మద్యం బాటిళ్లు డెలివరీ తీసుకున్నాక వాటిని తిరిగి ఇవ్వడానికి అవకాశం లేదు. అయితే స్టోర్ నుంచి కలెక్ట్ చేయడానికి ముందే ఆర్డర్‌ను రద్దు చేసుకునే సదుపాయం మాత్రం అందుబాటులో ఉంది. క్యూలలో నిలబడే ఇబ్బంది లేకుండా ముందుగానే స్టాక్ చెక్ చేసుకుని కొనుగోలు చేయడానికి ఈ యాప్ ఉపయోగపడనుంది.