కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రి హర్దీప్ సింగ్ పురీని మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేట్ చేసింది బీజేపీ. వాస్తవానికి ఉత్తరప్రదేశ్ నుంచి ఆయనను మళ్లీ బరిలోకి దింపుతారనే ప్రచారం జోరుగా జరిగింది. కానీ యూపీ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో రాజకీయ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. నవంబర్‌తో పురీ ప్రస్తుత రాజ్యసభ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో.. మధ్యప్రదేశ్ నుంచి ఆయనకు అవకాశం కల్పించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
మరోవైపు యూపీ నుంచి రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ 7 మంది కొత్త అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో ప్రస్తుత ఎంపీలు ఎవరికీ పార్టీ మళ్లీ అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. ధరంపాల్ సింగ్, రాధాకాంత్ ఓజా, ప్రకాష్ పాల్, విద్యాసాగర్ సోంకర్, గోపి కృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, శ్రుతి గంగ్వార్‌లను బీజేపీ ఎంపిక చేసింది. ఈ నిర్ణయం ద్వారా ఎప్పట్నుంచో ఉన్న పాత ముఖాలను పక్కనపెట్టి కొత్త వ్యూహంతో బీజేపీ ముందుకా సాగుతోంది.
మాజీ డిప్లమాట్ అయిన హర్దీప్ సింగ్ పురీ.. కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన పెట్రోలియం శాఖతో పాటు పలు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. అయితే యూపీకి బదులుగా మధ్యప్రదేశ్ నుంచి ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయడం వెనుక రాజకీయ కారణాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం కేంద్ర కేబినెట్లో త్వరలో జరగబోయే మంత్రివర్గ మార్పుల గురించిన ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. కేబినెట్ మార్పులపై ప్రస్తుతానికైతే బీజేపీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ALSO READ : నాసిక్ కుంభమేళాకు భారీ ఏర్పాట్లు..
ప్రస్తుతం హర్దీప్ సింగ్ పురీ పదవీకాలం ముగుస్తున్న సమయం, మధ్యప్రదేశ్ నుంచి ఆయన నామినేషన్ దక్కడం, యూపీలో కొత్త వారికే అవకాశం ఇవ్వడం వంటి పరిణామాలు బీజేపీ రాజకీయ వ్యూహాల్లో వస్తున్న మార్పులకు అద్దం పడుతున్నాయి. రాబోయే ఎన్నికలు, పార్టీ అంతర్గత సమీకరణాల నేపథ్యంలో ఈ పరిణామాలు జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
