ఓటు ఉన్నళ్లోకు మళ్లీ ఫామ్ 6 ఏంటీ.. అసలు బుర్ర వాడారా..? ఈసీపై సుప్రీంకోర్టు ఫైర్

ఓటు ఉన్నళ్లోకు మళ్లీ ఫామ్ 6 ఏంటీ.. అసలు బుర్ర వాడారా..? ఈసీపై సుప్రీంకోర్టు ఫైర్

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ సమయంలో ఎన్నికల సంఘం అసలు బుర్ర ఉపయోగించిందా లేదా అని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఓటర్ల జాబితా నుండి పేర్లు తొలగించబడిన లేదా చిరునామా మారిన పాత ఓటర్లను.. కొత్త ఓటర్ల నమోదు కోసం ఉద్దేశించిన ఫారం 6 నింపమని ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించింది. రెండు వారాల్లోగా దీనికి సమాధానం చెప్పాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈసీని ఆదేశించింది. ఓటర్ల జాబితాలో ఇప్పటికే ఉండి, కేవలం తమ చిరునామాను మార్చుకున్న ఓటర్లను ఫారం 8 నింపడానికి అనుమతించాలని సూచించింది. 

సర్ ప్రక్రియలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 43 లక్షల ఓటర్ల పేర్లను ఈసీ తొలగించింది. సామాజిక కార్యకర్తలు అంజలి భరద్వాజ్, అమృతా జోహ్రీ దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్రమంగా ఓట్లు తొలగించారని.. అలాగే ఓటరు జాబితా నుంచి తొలగించబడిన పాత ఓటర్లు తమ పేర్లను తిరిగి చేర్చుకోవడానికి ఈసీ ఫారం-6  సమర్పించాలని ఆదేశించడాన్ని వారు సవాల్ చేశారు. 

సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం బుధవారం (అక్టోబర్ 28) ఈ పిటిషన్‎పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఓటు హక్కు కలిగి ఉన్నవారిని కొత్త ఓటర్ నమోదు కోసం ఉద్దేశించిన ఫారం 6  సమర్పించమని కోరడం ఏంటీ..? ఢిల్లీ సర్ ప్రక్రియలో ఈసీ అసలు బుర్ర ఉపయోగించిందా అని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. పాత ఓటర్లు తాము ఇంతకుముందెన్నడూ ఓటు వేయలేదనే డిక్లరేషన్ ఉండే ఫారం-6ను ఎలా సమర్పిస్తారని కోర్టు ప్రశ్నించింది. 

►ALSO READ | భర్త రెండో పెళ్లి.. విడాకుల కేసులో విచారణ పూర్తయ్యాక కొత్త సాక్ష్యాలు ఇవ్వొచ్చా ? హైకోర్టు ఏం చెప్పిందంటే!

ఈ నిబంధనపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఓటర్ల జాబితా నుండి పేర్లు తొలగించబడిన లేదా చిరునామా మార్చుకున్న ఓటర్లు, చిరునామా మార్పుల కోసం ఫారం 8 దాఖలు చేసేందుకు అవకాశం కల్పించి ప్రక్రియను పూర్తి చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. సర్ నోటీసులు అందుకున్న ఓటర్లు తమ ఓటు పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 30తో గడువు ముగుస్తున్న నేపథ్యంలో అవసరమైతే ఈ గడువును పొడిగిస్తామని ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు.