ఏఈఈ ఎగ్జామ్ను వాయిదా వేయలేం..అభ్యర్థుల వినతులను టీజీపీఎస్సీ పరిశీలించాలి: హైకోర్టు 

ఏఈఈ ఎగ్జామ్ను వాయిదా వేయలేం..అభ్యర్థుల వినతులను టీజీపీఎస్సీ పరిశీలించాలి: హైకోర్టు 

హైదరాబాద్, వెలుగు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌‌ (ఏఈఈ –సివిల్‌‌) పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థుల విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. అయితే, ఇతర పరీక్షలు కూడా ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అభ్యర్థులు అక్టోబరు 30వ తేదీ సాయంత్రంలోగా వెబ్‌‌నెట్‌‌ ద్వారా వినతిపత్రాలు సమర్పించవచ్చని స్పష్టం చేసింది.

వాటిని పరిశీలించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. నవంబరు 6, 7 తేదీల్లో నిర్వహించనున్న ఏఈఈ పరీక్షలను వాయిదా వేయాలని సతీశ్​ అనే అభ్యర్థితో పాటు మరో ఆరుగురు దాఖలు చేసిన పిటిషన్‌‌ ను జస్టిస్‌‌ కె.శరత్‌‌ శుక్రవారం విచారించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఎస్సెస్సీ జూనియర్‌‌ ఇంజినీర్‌‌ (జేఈ) పరీక్షలు నవంబరు 2 నుంచి 6వ తేదీ వరకు ముంబై, పుణె, థానే, నాందేడ్‌‌ తదితర ప్రాంతాల్లో జరగనున్నాయని తెలిపారు.

అక్కడ పరీక్షలు రాసిన అభ్యర్థులు మరుసటి రోజే తెలంగాణలో ఏఈఈ పరీక్షలకు హాజరుకావడం ఇబ్బందికరమని పేర్కొన్నారు. రెండు పరీక్షల మధ్య కనీసం వారం రోజుల వ్యవధి ఉండేలా ఏఈఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. ఒడిశా పబ్లిక్‌‌ సర్వీస్‌‌ కమిషన్‌‌ కూడా పరీక్షను వాయిదా వేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు అక్టోబరు 5, 9, 14 తేదీల్లో వినతిపత్రాలు ఇచ్చినా టీజీపీఎస్సీ స్పందించలేదని తెలిపారు.

కమిషన్‌‌ తరఫున సీనియర్‌‌ న్యాయవాది పీఎస్‌‌. రాజశేఖర్‌‌ వాదిస్తూ.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పరీక్షల షెడ్యూల్​ను ఖరారు చేశామని చెప్పారు. ఎస్సెస్సీ జేఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండగా, ఏఈఈ పరీక్షకు 40 వేల మందికిపైగా హాజరుకానున్నారని వివరించారు.

రెండు పరీక్షలు ఒకే సమయంలో జరుగుతున్నాయన్న కారణంతో ఒక పరీక్షను వాయిదా వేయడం సాధ్యం కాదని, ఈ అంశంపై ఇప్పటికే పలు తీర్పులు ఉన్నాయని పేర్కొన్నారు. రెండు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ సమస్యలను తెలియజేసేందుకు వెబ్‌‌నెట్‌‌ ద్వారా వినతిపత్రాలు సమర్పించే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పరీక్షల వాయిదాకు నిరాకరిస్తూ, వెబ్‌‌నెట్‌‌ ద్వారా అందే వినతిపత్రాలను పరిశీలించాలని టీజీపీఎస్సీని ఆదేశించారు.