హైదరాబాద్, వెలుగు: తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ)లో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ప్రిలిమినరీ కీని టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు ఒక్కో ప్రశ్నకు రూ.500 ఫీజు చెల్లించాలని స్పష్టం చేసింది. అభ్యంతరం సరైనదని తేలితే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని వెల్లడించింది.
ఈ మేరకు టీజీపీఎస్సీ సెక్రటరీ హరిత ప్రకటన రిలీజ్చేశారు. ఈ నెల 26న నిర్వహించిన పరీక్షకు సంబంధించిన పేపర్-1, పేపర్-2 మాస్టర్ ప్రశ్నపత్రాలతో పాటు ప్రిలిమినరీ కీని కమిషన్ అధికారిక వెబ్సైట్ www.tgpsc.gov.in లో పెట్టినట్టు చెప్పారు. ‘కీ’పై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ వివరాలతో వెబ్సైట్ ద్వారా నవంబర్ 2 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని సూచించారు. కేవలం వెబ్సైట్ లింక్ ద్వారా మాత్రమే అభ్యంతరాలను స్వీకరిస్తామని.. పోస్ట్, ఈ-మెయిల్ లేదా రాతపూర్వకంగా ఇచ్చే వినతులను ఎట్టిపరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోబోమని ప్రకటించారు.
