ఆగ్నేయాసియా దేశాల సంస్థ (ఆసియాన్) అనేది ఆర్థిక, సాంఘిక, సాంస్కృతికపరమైన సహకార సంస్థ. ప్రాంతీయ భద్రత ద్వారా జాతీయ భద్రతను లేదా జాతీయ భద్రత ద్వారా ప్రాంతీయ భద్రతను సాధించేందుకు 1996, ఆగస్టు 8న బ్యాంకాక్ (థాయిలాండ్)లో స్థాపించారు. ప్రతి ఏటా ఆగస్టు 8న ఆసియాన్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఇండోనేషియా రాజధాని జకర్తాలో ఉన్నది.
వ్యవస్థాపక దేశాలైన ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్ (ఐదు దేశాలు)లు ఆసియాన్ స్థాపనకు ఉద్దేశించిన పత్రంపై సంతకాలు చేశాయి. ఈ పత్రాన్ని ఆసియాన్ ప్రకటన (ఆసియాన్ డిక్లరేషన్)గా వ్యవహరిస్తారు. 1984, జనవరి 7న ఆరో దేశంగా బ్రూనై దారుస్సలాం, 1995, జులై 28న ఏడో దేశంగా వియత్నాం, 1997, జులై 23న 8, 9 సభ్య దేశాలుగా లావోస్, మయన్మార్, 1999, ఏప్రిల్ 30న పదో దేశంగా కంబోడియా చేరింది. 11వ సభ్య దేశంగా తూర్పు తైమూర్ చేరికతో ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య 11కు చేరింది. ఆసియాన్ సచివాలయాన్ని 1976, ఫిబ్రవరి 24న స్థాపించారు.
ఆశయాలు
- ఆగ్నేయాసియా ప్రాంతంలో ఆర్థికవృద్ధి, సామాజిక ప్రగతి, సాంస్కృతిక అభివృద్ధిని వేగవంతం చేయడం.
- ఆగ్నేయాసియా ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను, సమన్యాయ పాలనను సాధించడం.
- ఐక్యరాజ్యసమితి ప్రవేశికలోని సూత్రాలకు కట్టుబడి ఉండటం.
ప్రధాన సూత్రాలు
- సభ్యరాజ్యాల స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ ప్రతిపత్తిపై పరస్పర గౌరవం కలిగి ఉండటం.
- ప్రతి రాజ్యం బహిర్గత ఒత్తిడులు, నిర్బంధాలు ఏవీ లేకుండా స్వతంత్రంగా మనుగడను సాగించే హక్కును కలిగి ఉండటం.
- సభ్యరాజ్యాల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం.
- సభ్యరాజ్యాల మధ్య ఉత్పన్నమయ్యే సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం.
- సభ్యరాజ్యాల మధ్య సహకార సంబంధాలను పెంపొందించుకోవడం.
ప్రధాన విభాగాలు
- ఆసియాన్ రాజకీయ, భద్రత సంస్థ (ఆసియాన్ పొలిటికల్ అండ్ సెక్యూరిటీ కమ్యూనిటీ).
- ఆసియాన్ ఆర్థిక సమాజం
- (ఆసియాన్ ఎకనామిక్ కమ్యూనిటీ).
- ఆసియాన్ సామాజిక – సాంస్కృతిక సమాజం
- ( ఆసియాన్ సోషల్ – కల్చరల్ కమ్యూనిటీ).
- ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా 2006, డిసెంబర్ 4న ఆసియాన్‌కు పరిశీలక హోదాను కల్పించింది.
ప్రాంతీయ భద్రత
1994లో ప్రాంతీయ భద్రత కోసం ఆసియాన్ రీజనల్ ఫోరమ్‌ను స్థాపించారు. ఇది ఆసియా పసిఫిక్ ప్రాంతాలకు సంబంధించి బహుళ పక్షాల మధ్య భద్రతాపరమైన అంశాలపై చర్చలు జరుపుతుంది. ఇందులో 27 సభ్య దేశాలు ఉన్నాయి.
2008, డిసెంబర్లో ఆసియాన్ చార్టర్ అమలులోకి వచ్చిన తర్వాత ప్రతి రెండేండ్లకు ఒకసారి సదస్సును జరపాలని నిర్ణయించారు.
తొలి ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు ఇండోనేషియాలోని బాలిలో 1976, ఫిబ్రవరిలో జరిగింది.
47వ ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు మలేషియాలోని కౌలాలంపూర్‌లో 2025, అక్టోబర్ 26 – 28 మధ్యలో జరుగుతోంది. ఈ సదస్సులో ముఖ్య పరిణామం తూర్పు తైమూర్ దేశానికి ఆసియాన్‌లో 11వ సభ్యదేశంగా స్వాగతం పలకనున్నారు.
48వ శిఖరాగ్ర సదస్సు
48వ శిఖరాగ్ర సదస్సు ఫిలిప్పీన్స్‌లోని సెబు నగరంలో నిర్వహించారు. ఈ సదస్సు 2026, మే 6 నుంచి 8 వరకు కొనసాగింది.
అధ్యక్షత: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు. ప్రధాన నినాదం: నావిగేటింగ్ అవర్ ఫ్యూచర్, టు గెదర్/ భవిష్యత్తును కలి కలిసి నడిపించడం.
ముఖ్యమైన చర్చలు
ప్రాంతీయ, ఆహార, ఇంధన భద్రత, డిజిటల్ రూపాంతరణ తదితర అంశాలపై సభ్య దేశాలు చర్చలు జరిపాయి. అలాగే దక్షిణ చైనా సముద్రంలో శాంతిభద్రతలు, ప్రాంతీయ సహకారంపై ప్రత్యేక దృష్టి సారించాయి.
– వెలుగు, ఎడ్యుకేషన్ డెస్క్
