ఏపీలో స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న సంగతి తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా జరిగిన ఘర్షణల కారణంగా ఏపీ స్థానిక ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంటే... టీడీపీ జడ్పీటీసీ అబ్యర్థి పొందుపరిచిన అఫిడవిట్ అందరినీ షాక్ కి గురి చేస్తోంది. నామినేషన్ సందర్భంగా సదరు అభ్యర్థి సమర్పించిన అఫిడవిట్ లో తన కుటుంబ ఆస్తుల విలువ రూ. 172 కోట్లుగా ఉండటమే ఇందుకు కారణం. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
చిత్తూరు జిల్లా గుడిపాల జడ్పీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మమతశ్రీ. నామినేషన్ సందర్భంగా మమతశ్రీ తన కుటుంబ ఆస్తుల విలువ రూ.172 కోట్లుగా అఫిడవిట్ సమర్పించడం హాట్ టాపిక్ గా మారింది.మమతశ్రీ అఫిడవిట్ చూసి ఎన్నికల అధికారులు సైతం ఖంగుతిన్నట్లు తెలుస్తోంది.
మమతశ్రీ కుటుంబ ఆస్తుల వివరాలు:
మమతశ్రీ అఫిడవిట్ లో రూ.9.28 కోట్ల చరాస్తులు, రూ.162.99 కోట్ల స్థిరాస్తులు, ఆమె భర్త మొగిలీశ్వర నాయుడు పేరిట కలిపి రూ.32 కోట్ల రుణాలు, మొత్తం ఆస్తుల విలువ నుంచి ఈ రుణాలను తీసివేస్తే రూ.140.27 కోట్లు ఉందని.. కుటుంబానికి మొత్తం 44.62 ఎకరాల వ్యవసాయ భూమి, నివాస భవనాల విలువ రూ.24.89 కోట్లుగా వెల్లడించారు.
మమతశ్రీ దగ్గర 1.10 కిలోల బంగారం, 15 కిలోల వెండి, భర్త మొగిలీశ్వర నాయుడు పేరిట మూడు సరకు రవాణా వాహనాలు, మరో మూడు కాంక్రీట్ మిక్సర్ ట్రక్కులు ఉన్నట్లు వెల్లడించారు. కుటుంబానికి ఉన్న మొత్తం చరాస్తుల విలువ రూ.9.28 కోట్లుగా చూపించారు.
