AI టెక్నాలజీ వేగంగా దూసుకుపోతున్న వేళ, ప్రపంచానికి పెను ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు కలవరపెడుతున్నాయి. రాబోయే 10 ఏళ్లలో ఏఐ కారణంగా మానవాళి అంతరించిపోయే ప్రమాదం 50 శాతానికి పైగా ఉందని ప్రముఖ ఏఐ సేఫ్టీ పరిశోధకుడు, మెషిన్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు.. నేట్ సోరెస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలైన్మెంట్ రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి.
భవిష్యత్తుపై నమ్మకం లేకపోవడంతో సోరెస్ తన రిటైర్మెంట్ కోసం డబ్బులు సేవ్ చేయటం కూడా ఆపేయడం షాకింగ్ గా ఉంది. గూగుల్‌లో పనిచేస్తున్న రోజుల్లో తెరిచిన పెన్షన్ అకౌంట్ కి గడచిన 10 ఏళ్లుగా తాను ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేయట్లేదని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. భవిష్యత్తే లేనప్పుడు రిటైర్మెంట్ కోసం డబ్బులు దాచుకోవడం ఎందుకని ఆయన ప్రశ్నించడం.. AI ముప్పు తీవ్రతకు అద్దం పడుతోంది. ఏఐ పరిశోధనా రంగంలో ఉన్న జియోఫ్రీ హింటన్ వంటి దిగ్గజాలు కూడా రాబోయే కాలంలో మానవాళికి ముప్పు ఉండే అవకాశం 10 శాతం వరకు ఉందని గతంలో అంచనా వేశారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తయారు చేస్తున్న అత్యంత శక్తివంతమైన ఏఐ సిస్టమ్స్ ఒక దశలో మానవ నియంత్రణను పూర్తిగా దాటిపోయే అవకాశం ఉందని సోరెస్ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఏఐ మోడల్స్ అబద్ధాలు చెప్పటం, వాస్తవాలను దాయటం, తమంతట తామే నిర్ణయాలు తీసుకోవటం, సైబర్ అటాక్స్ చేయటం, యజమానుల కళ్లుకప్పి నచ్చిన పనులు చేస్తుండటం జరుగుతూనే ఉంది. మానవుల ఉద్దేశాలకు విరుద్ధంగా ఏఐ తనకంటూ స్వంత లక్ష్యాలను ఏర్పరచుకోవచ్చని, సొంతంగా తన సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటూ మనుషుల ప్రమేయం లేకుండా స్వయంప్రతిపత్తితో వ్యవహరించగలదనే ఆయన ఆందోళన నిజం అయ్యేలాగా కనిపిస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే. ఒకవేళ అలా జరిగితే.. భూమిపై మానవుల మనుగడకు సరిపడే వాతావరణాన్ని మార్చివేసి, ఈ గ్రహాన్ని ఏఐ తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రమాదం ఉందని నేట్ సోరెస్ హెచ్చరిస్తున్నారు.
గూగుల్, మైక్రోసాఫ్ట్‌లలో ఇంజనీర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న సోరెస్.. "ఎవరు దీనిని నిర్మించినా, అందరూ చనిపోతారు" అనే పుస్తకానికి సహ రచయిత కూడా. ఏఐ సిస్టమ్స్ ఒకసారి సొంత లక్ష్యాలను ఏర్పరచుకుని విస్తరించుకోవడం ప్రారంభిస్తే వాటిని ఆపటం మనుషుల తరం కాదని అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తీరు మానవాళి మనుగడకే పెను ముప్పుగా మారుతుందన్న ఈ నిపుణుడి హెచ్చరికలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
