- గ్రౌండ్ వాటర్ విచ్చలవిడి వినియోగంపై కొరడా
- వ్యాపార, వాణిజ్య, పరిశ్రమల్లో నీటి వినియోగానికి లెక్కలు
- కిలో లీటరుకు రూపాయి చొప్పున యూజర్ చార్జీలు
మంచిర్యాల, వెలుగు: ఎల్‌నినో ఎఫెక్ట్‌తో రానున్న రోజుల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వం భూగర్భ జలాల పరిరక్షణపై దృష్టి సారించింది. గ్రౌండ్‌వాటర్ విచ్చలవిడిగా వినియోగించడాన్ని నియంత్రించడంతో పాటు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే అమల్లో ఉన్న వాల్టా చట్టంతో పాటు జీవో 15 నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇకపై ఇష్టారీతిన బోర్లు వేసి భూగర్భ జలాలను తోడుకునేందుకు వీల్లేదు.
ఎన్ వోసీ తప్పనిసరి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తాగునీటి అవసరాలకు మినహా ఇతర బోర్లు తవ్వడంపై నవంబర్ 1 నుంచి నిషేధం అమల్లోకి రానుంది. జీహెచ్ఎంసీ పరిధిలో తాగునీటి బోర్లతో పాటు ఇతర ప్రాంతాల్లో కొత్తగా బోర్లు వేయాలంటే గ్రౌండ్‌వాటర్ డిపార్ట్‌మెంట్‌నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యవసాయం, గృహ, వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, వాటర్ ప్లాంట్లు, ఇండస్ట్రీస్, మైన్స్సహా అన్ని రంగాలకు ఈ రూల్ వర్తిస్తుంది. నిర్ణీత రూ.10 వేల ఫీజు చెల్లిస్తే నిబంధనల మేరకు ఆఫీసర్లు ఎన్వోసీ జారీ చేస్తారు.
కొత్త సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే సమయంలో ఎన్వోసీని పరిశీలించాలని ప్రభుత్వం ఆయా శాఖలకు స్పష్టం చేసింది. ఇప్పటికే పర్మిషన్ లేకుండా వేసిన బోర్లను వెంటనే రెన్యువల్ చేసుకోవాలని, గడువు ముగిసిన ఎన్వోసీలను వెంటనే పునరుద్ధరించుకోవాలని సూచించింది. బోర్వెల్ రిగ్గుల వినియోగంపైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రిజిస్ట్రేషన్ కలిగిన డ్రిల్లింగ్ రిగ్గులను మాత్రమే వినియోగించాలని, రిజిస్ట్రేషన్ లేని వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించింది. రానున్న రోజుల్లో భూగర్భ జలాలను క్రమబద్ధీకరించి, దుర్వినియోగాన్ని అరికట్టడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని ఆఫీసర్లు
పేర్కొంటున్నారు.
యూజర్ చార్జీలు..
గ్రౌండ్ వాటర్‌ను అధికంగా వినియోగించే ఇండస్ట్రీస్, వాణిజ్య సంస్థలపై యూజర్ చార్జీలు విధించనున్నారు. బ్రిక్స్ పరిశ్రమలు, రెడీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్లు, మినరల్ వాటర్, డిస్టిల్డ్ వాటర్ ప్లాంట్లు, గోలిసోడా, ఐస్ తయారీ యూనిట్లు, ఐస్‌క్రీమ్ కంపెనీలు, ఆటోమొబైల్ సర్వీసింగ్ సెంటర్లు, హోటల్స్, రెస్టారెంట్లు, అపార్ట్మెంట్లు, స్విమ్మింగ్ పూల్స్, స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులు తదితర సంస్థలు యూజర్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. నీటి వినియోగాన్ని లెక్కించేందుకు డిజిటల్ ఫ్లో మీటర్లు ఏర్పాటు చేసుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి చెందిన సంస్థల్లో ప్రతి వెయ్యి లీటర్లకు రూ.1 చొప్పున యూజర్ చార్జీలు వసూలు చేస్తున్నారు.
మైన్స్, ఇండస్ట్రీల్లో రోజువారీగా వెలికితీసే గ్రౌండ్‌వాటర్ సామర్థ్యాన్ని బట్టి ఈ టారిఫ్ మారుతుంది. సాధారణ పరిశ్రమలకు సంబంధించి సురక్షిత ప్రాంతాల్లో ప్రతి కిలో లీటర్‌కు రూ.2 నుంచి రూ.10 వరకు, ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్ ఏరియాల్లో ఈ టారిఫ్‌లు రూ.20 నుంచి రూ.100 వరకు విధిస్తున్నారు. ఈ మేరకు గ్రౌండ్ వాటర్ శాఖ ఆఫీసర్లు సంబంధిత సంస్థలకు నోటీసులు జారీ చేస్తున్నారు. భారీ పరిశ్రమలైన సింగరేణి కోల్ మైన్స్, సిమెంట్ పరిశ్రమలకు సంబంధించిన సున్నపురాయి మైన్స్ మాత్రమే ఎన్వోసీలు తీసుకొని యూజర్ చార్జీలు చెల్లిస్తుండగా, ఇందులో గ్రానైట్, స్టోన్ మైన్స్‌లను సైతం చేర్చాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మినహాయింపు..
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వ్యక్తిగత గృహ వినియోగదారులు, వ్యవసాయ కార్యకలాపాలు, రూరల్ వాటర్ సప్లై స్కీములు, సాయుధ దళాల సంస్థలకు యూజర్ చార్జీల నుంచి మినహాయింపు ఉంది. అర్బన్ ఏరియాలోని నివాస అపార్ట్మెంట్లు, గ్రూప్ హౌసింగ్ సొసైటీలకు నెలవారీ మీటర్ రీడింగ్ ఆధారంగా యూజర్ చార్జీలు విధిస్తున్నారు. వీటికి సైతం శ్లాబును బట్టి టారిఫ్ మారుతుంది. ఇంకుడు గుంతలు వంటి గ్రౌండ్ వాటర్ రీచార్జి నిర్మాణాలు చేపడితే మాత్రం 50 శాతం రిబేట్ లభిస్తుంది.
