అభివృద్ధిని చూసి ఓర్వలేకే మంత్రి, ఎంపీలపై తప్పుడు ఆరోపణలు : డీసీసీ ప్రెసిడెంట్ పి.రఘునాథ్ రెడ్డి

అభివృద్ధిని చూసి ఓర్వలేకే  మంత్రి, ఎంపీలపై తప్పుడు ఆరోపణలు :  డీసీసీ ప్రెసిడెంట్ పి.రఘునాథ్ రెడ్డి
  •     వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణ నియోజకవర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్రు
  •     బీజేపీ నాయకులు నిజాలేంటో తెలుసుకొని మాట్లాడాలి 
  •     డీసీసీ ప్రెసిడెంట్​పి.రఘునాథ్ ​రెడ్డి 

కోల్​బెల్ట్, వెలుగు : చెన్నూరు అసెంబ్లీ, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలలో రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ లీడర్లు తప్పుడు ఆరోపణలతో దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని డీసీసీ ప్రెసిడెంట్​ పిన్నింటి రఘునాథ్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రెస్​క్లబ్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ కేంద్ర సర్కార్​ తీసుకొచ్చిన ‘సర్’ ప్రక్రియలో అర్హులైన ఓటర్లను తొలగిస్తున్నారని కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు నిరసనలు ధర్నాలు చేపడితే బీజేపీ నాయకులు తప్పు పట్టడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్  ఓట్లు తొలగించే ఉద్దేశంతోనే బీజేపీ ప్రభుత్వం ‘సర్’ ప్రక్రియను తీసుకొచ్చిందని ఆరోపించారు. 

సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్తే అప్పటి కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి ఎన్టీపీసీ నుంచి రూ.400 కోట్ల రుణం ఇప్పించి సంస్థతో పాటు లక్ష ఉద్యోగాలను కాపాడరని, ఆయన చొరవతోనే మంచిర్యాల జిల్లాలోని నియోజకవర్గాల్లో గోదావరి శాశ్వత తాగునీటి పథకం ద్వారా ప్రజలు దాహర్తీని తీర్చుకుంటున్న  విషయం బీజేపీ లీడర్లకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. మూతపడ్డ రామగుండం ఎరువుల కార్మాగారానికి రూ.10వేల కోట్ల నిధులు ఇప్పించి ఫ్యాక్టరీని రీఓపెన్ చేయించిన ఘనత అప్పటి ఎంపీ, ప్రస్తుత మంత్రి వివేక్​ వెంకటస్వామికే దక్కుతుందన్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందిస్తున్న కాకా వెంకటస్వామి కుటుంబాన్ని విమర్శించే ముందు బీజేపీ లీడర్లు నిజాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. నవంబర్ 1న ‘సర్’ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని రాం లీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమాన్ని సక్సెస్​ చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.