న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో (ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్) ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్ (క్యూ2) లో తన నికర నష్టాన్ని రూ.1,879.1 కోట్లకు తగ్గించుకుంది. గతేడాది ఇదే క్వార్టర్‌లో కంపెనీకి రూ.2,582.1 కోట్ల నష్టం వచ్చింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఖర్చులు భారీగా పెరగడం, డాలరుతో రూపాయి విలువ తగ్గడంతో కంపెనీకి నష్టాలొస్తున్నాయని ఇండిగో సీఈఓ విల్లీ వాల్ష్ పేర్కొన్నారు. ఇంధన ధరలు పెరగడంతో టికెట్ రేట్లు పెంచాల్సి వస్తోందని అన్నారు.
ఇండిగోకి సెప్టెంబర్ క్వార్టర్‌లో రూ.24,311.9 కోట్ల ఆదాయం వచ్చింది. కిందటేడాది ఇదే క్వార్టర్‌లో వచ్చిన రూ.19,599.5 కోట్ల నుంచి 24శాతం పెరిగింది. అయితే ఖర్చులు కూడా రూ.26,188.4 కోట్లకు ఎగబాకాయి. ముఖ్యంగా ఏటీఎఫ్ ఖర్చులు ఏకంగా 67.2శాతం పెరిగి రూ.9,966.8 కోట్లను తాకాయి. క్యూ2లో ప్రయాణించిన ప్రయాణికుల సంఖ్య 4.7శాతం తగ్గి 2.75 కోట్లకు పరిమితమైంది. రాబోయే డిసెంబర్ క్వార్టర్‌లో కార్యకలాపాల సామర్థ్యం పెరుగుతుందని విల్లీ వాల్ష్ అన్నారు.
