జనగణనతో కులగణన చేయాలి ..ప్రశ్నావళిలో ఓబీసీ కాలమ్ చేర్చాలి: మంత్రి పొన్నం

 జనగణనతో కులగణన చేయాలి ..ప్రశ్నావళిలో ఓబీసీ కాలమ్ చేర్చాలి: మంత్రి పొన్నం
  • మంత్రి పొన్నంతో ఎంపీ ఆర్. కృష్ణయ్య, బీసీ సంఘాల నేతల భేటీ

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణనతో పాటు కుల గణన కూడా నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. అందులో ఎస్సీ, ఎస్టీలతో పాటు తప్పనిసరిగా ఓబీసీ కాలమ్ చేర్చాలన్నారు. 

గురువారం సెక్రటెరియెట్ లో మంత్రిని ఎంపీ ఆర్.కృష్ణయ్య, బీసీ సంఘాల నేతలు కలిసిన సందర్భంగా కులగణనపై చర్చించారు. కేంద్రం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని మంత్రి ఆర్.కృష్ణయ్యను కోరారు. త్వరలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నందున, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బీసీ ప్రజా ప్రతినిధిలు, బీసీ సంఘాల నేతలను కలుపుకొని వెళ్లి ఓబీసీ కాలమ్ పెట్టాలని అమిత్ షాను అడగాలన్నారు.

 గతంలో జన గణనలో కుల గణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, ఈ ఏడాది ఆగస్ట్ లో ఇచ్చిన జనగణన ప్రశ్నావళిలో ఓబీసీ కాలమ్ లేదని చెప్పారు. 'కులాల లెక్కలు ఉంటేనే ఓబీసీ లెక్క తెలుస్తుంది. 

కోర్టుల్లో రిజర్వేషన్లు 50 శాతం మించి అడుగుతున్నప్పుడల్లా, కులాల వారీగా ఖచ్చితమైన జనాభా లెక్కలు అడుగుతున్నారు. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి జరుగుతున్న జన గణనలో ఓబీసీ కుల గణన చేయాలని కోరుతున్నాను. జన గణనలో కుల గణన చేర్చాలని ఇప్పటికే రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. 

ఓబీసీ కాలమ్ పెట్టడం వల్ల జనాభా లెక్కలు ఖచ్చితంగా తెలుస్తాయి. దాని ఆధారంగా చట్టసభల్లో బీసీలకు తగిన రిజర్వేషన్లు పెంచడానికి, బడ్జెట్ కేటాయింపులు చేయడంతో పాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ప్రక్రియ సులభమవుతుంది' అని మంత్రి పేర్కొన్నారు.