వెలుగు స్పెషల్ : డిండి ఎత్తిపోతలను పూర్తి చేయాలి..తాగునీటికి కృష్ణా జలాలు అందించాలని ప్రజలు సుదీర్ఘ పోరాటం

వెలుగు స్పెషల్ : డిండి ఎత్తిపోతలను పూర్తి చేయాలి..తాగునీటికి కృష్ణా జలాలు అందించాలని ప్రజలు సుదీర్ఘ పోరాటం

నల్గొండ జిల్లాలో కరువు పీడిత ప్రాంతాలుగా గుర్తింపు పొంది,  ఫ్లోరిన్ పీడిత దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల గ్రామాలకు సాగు, తాగునీటికి కృష్ణా జలాలు అందించాలని ప్రజలు సుదీర్ఘ పోరాటం చేశారు.  

ఫలితంగా డిండి ఎత్తిపోతల పథకాన్ని 2004లో  వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నల్గొండ జిల్లా ప్రజా ప్రతినిధులతో చర్చించి డీటెయిల్డ్ సర్వేకు రూ.1.31 కోట్లు కేటాయించి జీవో ఎంఎస్ నెం.159ను -2007లో విడుదల చేశారు. 3.5 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు  తాగునీటిని అందించవచ్చని ఈ ప్రాజెక్టుకు రూ.5000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించారు. 

ఆనాడు శ్రీశైలం ఎడమగట్టు సొరంగంలో అంతర్భాగంగా 7.5 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన నక్కలగండి రిజర్వాయర్ నుంచి ఎగువ డిండి ప్రాజెక్టుకు ఎత్తిపోస్తూ  గ్రావిటీ కెనాల్స్ ద్వారా 3 లక్షల ఎకరాలు నల్గొండ జిల్లాలో, అచ్చంపేట తాలూకాలో 50 వేల ఎకరాలకు నీరందించవచ్చని నిర్ణయించడం జరిగింది.  కానీ రెండు దశాబ్దాలుగా ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీసీ పనులు పలు కారణాలతో  పూర్తికాకపోవటంతో ఎత్తిపోతల పథకం ఎండమావిగానే మిగిలిపోయింది.  

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని,  ఫీజుబులిటీ లేదని నిర్ణయానికివచ్చి ఈ పథకాన్ని పాలమూరు–-రంగారెడ్డి ఎత్తిపోతల్లో భాగంగా చేర్చడం జరిగింది.  రీడిజైన్ చేసి జీవో నెం.70  ద్వారా పాలమూరు–-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టాలని నిర్ణయించారు. 

3.40 లక్షల ఎకరాలకు సాగునీరు

శ్రీశైలం నుంచి వరద సమయంలో ఎగువ నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీలు(పాలమూరు -రంగారెడ్డికి 90 టీఎంసీలు, డిండి ఎత్తిపోతలకు +30 టీఎంసీలు) తరలించడానికి జీవో నెం. 105 తేదీ 10-06-2015న  రూ.35,200 కోట్లతో  ఆమోదించి 11-6-2015న  కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలమూరు- రంగారెడ్డికి శంకుస్థాపన చేశారు. 

 కృష్ణా ఉపనది అయిన డిండి నదిపైగల డిండి ప్రాజెక్టుకు ఎత్తిపోతల ద్వారా.. శ్రీశైలం రిజర్వాయర్ ఎగువ నుంచి వరద సమయంలో రోజుకు 0.5 టీఎంసీలు చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీలు డిండి ఎత్తిపోతలకు తరలించి, 3.40 లక్షల ఎకరాలకు సాగునీరు,  ఫ్లోరైడ్ పీడిత, కరువు ప్రాంతాలైన నల్గొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు  తాగునీటిని కూడా అందిస్తుంది.

 ఈ ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే జిల్లాలు నల్గొండ, రంగారెడ్డి, యాదాద్రి,  నాగర్ కర్నూల్.  2015 అగస్టులో ఆనాటి సీఎం కేసీఆర్ శివన్నగూడెం దగ్గర చర్లగూడెం రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శంకుస్థాపన చేశారు.  ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 6,190 కోట్లు.  రిజర్వాయర్స్,  సబ్ రిజర్వాయర్ల పనులకు టెండర్లు పిలిచి పనులు జరుగుతున్నాయి.  కానీ డిండి ఎత్తిపోతలకు నీరు ఎక్కడి నుంచి తరలించాలనే నిర్ణయం తీసుకోలేదు.

మహబూబ్ నగర్ నుంచి వ్యతిరేకత 

వెనుకబడిన పాలమూరు నీళ్లను అభివృద్ధి చెందిన నల్గొండకు తరలించడం ఏమిటి అని,  ఆ జిల్లాకు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీసీ నుంచే తీసుకోవాలని,  శ్రీశైలం నుంచి తీసుకునే 2 టీఎంసీలు పాలమూరు–- రంగారెడ్డికే ఇవ్వాలని ఆ జిల్లా ప్రజాప్రతినిధులు నియోజకవర్గాలలో  రైతాంగంతో  కలిసి ధర్నాలు చేసి,  రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రితో కలిసి ఆ జిల్లా ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. 

పాలమూరు జిల్లా ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను,  నల్గొండ జిల్లా ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న ఒత్తిళ్లను  దృష్టిలో పెట్టుకొని ఈ రెండు జిల్లాలకూ  ప్రయోజనకరంగా,  ఆమోదయోగ్యంగా ఉండేవిధంగా పాలమూరుకు 2 టీఎంసీలు కొనసాగిస్తూ..  డిండి లిఫ్ట్ కు 0.5 టీఎంసీలు, అచ్చంపేట లిఫ్ట్ కు 0.1 నీటిని అందించాలని నిర్ణయించడం జరిగింది.  ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమయ్యే మొత్తం 0.6 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి అదనంగా సమకూర్చుకోవాలని  సీఎం  మంత్రులతో, ఆ జిల్లా ప్రతినిధులతోను చర్చించి నిర్ణయం తీసుకున్నారు.  

అదనపు నీటిని లిఫ్ట్ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ రూపొందించాలని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి  స్పష్టం చేయటంతో రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు, రైతులు స్వాగతిస్తున్నారు. అనుకూలతలు, ప్రతికూలతలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పాలమూరు ఆయకట్టుకు చుక్కనీరు కూడా తగ్గకుండా డిండి, అచ్చంపేట పథకాలకు నీటిని తరలించేందుకు నిర్ణయం తీసుకోవటం మంచి నిర్ణయం.  

కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించాలి

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కృష్ణానది వరద జలాలపై చేపట్టిన పథకం.  రాష్ట్ర విభజనతో  కృష్ణా జలాల కేటాయింపుపై  తగాదాలు  జరుగుతున్న  నేపథ్యంలో  గత  బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర  సంవత్సరాలలో  తీవ్ర నిర్లక్ష్యాన్ని  ప్రదర్శించింది.  

పాలమూరు–రంగారెడ్డి  ప్రాజెక్టుకు  ప్రాధాన్యత ఇవ్వకుండా కేంద్రం నుంచి తీసుకోవలసిన అనుమతులైన పర్యావరణ, కేంద్ర జలసంఘం నుంచి పొందవలసిన అనుమతులు పొందకుండా ఉదాసీనంగా వ్యవహరించింది.  అదేవిధంగా  రెండు దశాబ్దాల క్రితం  నల్గొండ జిల్లా  సాగు, తాగునీటికి  చేపట్టిన ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీసీ, డిండి ఎత్తిపోతలను, పాలమూరు జిల్లాలో  చేపట్టిన భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి,  పాలమూరు ఎత్తిపోతల పథకాలు  పూర్తి చేయకుండా  నిర్లక్ష్యం వహించింది.  

ప్రాణహిత-చేవెళ్ల  పథకం  రీడిజైన్ చేసి కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి వేల కోట్లను ఖర్చు చేయటం జరిగింది. అదే ప్రాధాన్యతలో నిధులను కేటాయిస్తూ  పూర్తిచేస్తే ఇప్పటికే ఈ ప్రాజెక్టు పూర్తయ్యేది.  నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్  ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు పూర్తిస్థాయి నిధులను కేటాయించి పూర్తి చేయాలి. 


ఏదుల నుంచి డిండికి నీరు 

2023 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం   పాలమూరు- రంగారెడ్డి  పథకంలోని  ‘ఏదుల రిజర్వాయర్’ నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీళ్లు ఇవ్వాలని, వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని 20-9-2024న జరిగిన కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 

ఆ నిర్ణయం అనుగుణంగానే ఏదుల జలాశయం నుంచి పోతిరెడ్డిపల్లి  వరకు 22 కి. మీ మెయిన్ కెనాల్, దుందుభి నదిపై బరాజ్ పనులకు రూ.1800 కోట్లకు  జీవో నెం.11ను 22 జనవరి 2025 ద్వారా అనుమతులు జారీ చేశారు.  వెంటనే  టెండర్లు పిలిచి గుత్తేదారులతో ఒప్పందాలు
( అగ్రిమెంట్లు) చేశారు.  ప్రభుత్వ నిర్ణయాన్ని నల్గొండ జిల్లా ప్రజలు స్వాగతించి నాటి నుంచి ఎదురుచూస్తున్నారు.

- ఉజ్జిని రత్నాకర్ రావు, సీపీఐ సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.