వెలుగు స్పెషల్ : దేశవ్యాప్త ఎమ్మెల్సీ ఫ లితాలు మోదీ, రాహుల్కు ఏం చెపుతున్నాయి?

వెలుగు స్పెషల్ : దేశవ్యాప్త ఎమ్మెల్సీ ఫ లితాలు మోదీ, రాహుల్కు  ఏం చెపుతున్నాయి?

ఎమ్మెల్సీ టీచర్, గ్రాడ్యుయేట్ స్థానాల ఎన్నికల ఫలితాలను రాజకీయ పార్టీలు సాధారణంగా తీసుకుంటాయి. అందుకే వాటిని శాసనసభ, లోక్​సభ ఎన్నికలతో సమాన స్థాయిలో అవి పరిగణించడం తక్కువ.  కానీ మొన్న నాలుగు రాష్ట్రాల్లో వెలువడిన 28 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఫలితాలు మాత్రం దేశవ్యాప్తంగా ఆసక్తిగా మారడం విశేషం. అందుకు కారణం లేకపోలేదు.

 ఢిల్లీ కేంద్రంగా నీట్ పరీక్షపై జరిగిన నిరసనలు, కొంతకాలంగా ఓట్​ చోరీపై జరుగుతున్న ర్యాలీలు రాజకీయాలను బాగా వేడెక్కించాయి. అలాగే, కొద్ది నెలల్లో ఉత్తరప్రదేశ్​, ఉత్తరాఖండ్​, పంజాబ్​లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యం ఉండనే ఉంది. ఫలితంగా ఆ నాలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఫలితాలను ఆయా పార్టీలకు చిన్నపాటి సంకేతాలుగా భావించే అవకాశం ఉంది కాబట్టి అవి ఆసక్తిగా మారాయి.

కాంగ్రెస్​ ఒక్క నాగపూర్​ స్థానంలో తప్ప, పోటీ చేసిన  మిగిలిన 11 స్థానాల్లో ఓటమి పాలైంది.  దేశ ప్రధాని నరేంద్రమోదీ లోక్​సభ స్థానంలోని టీచర్​, గ్రాడ్యుయేట్ రెండు స్థానాల్లోనూ బీజేపీ ఓటమిపాలుకావడం ఆ పార్టీకి నిజంగానే మింగుడు పడని విషయంగా మారింది. అలాగే, అధికారంలో ఉన్న కర్నాటకలో 4 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక్కటీ గెలవకపోవడం కాంగ్రెస్​కు అంత కన్నా  మింగుడు పడని  విషయంగా మారింది. మొత్తం మీద, దేశ ప్రధాని మోదీ, దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్​గాంధీ ఇద్దరికీ ఈ ఎమ్మెల్సీ ఫలితాలు  చేదు  అనుభవాలనే  మిగిల్చాయని  చెప్పాలి.  

బీజేపీకి ఇరకాటంగా ఫలితాలు

ముందు బీజేపీ గురించి చెప్పుకోవాలంటే, కర్నాటకలో ఎన్డీఏ 4 స్థానాలను స్వీప్​ చేయడం ఆ పార్టీ గొప్పగా చెప్పుకోదగ్గ విషయమే. అలాగే, మహారాష్ట్రలో బీజేపీ కూటమి కొన్ని స్థానాలను గెలవగలిగింది తప్ప కాంగ్రెస్​  కూటమిని నిలువరించలేకపోయింది. బిహార్​లో ఎన్డీఏ కూటమి 3 స్థానాలు గెలిచి ఫరవాలేదని అనిపించుకుంది.

 కీలకమైన ఉత్తరప్రదేశ్​ 11 స్థానాలలో బీజేపీ 6 స్థానాలను గెలుచుకోగలిగింది తప్ప,  మిగిలిన 5 స్థానాల్లో సమాజ్​వాదీ పార్టీ గెలుపులను ఆపలేకపోయింది. వాటిలో స్వయాన ప్రధాని మోదీ లోక్​సభ నియోజకవర్గం వారణాసి లోని  రెండు ఎమ్మెల్సీ స్థానాలనూ సమాజ్​వాదీ పార్టీ గెలుచుకోవడమే బీజేపీకి బాగా ఇబ్బంది కలిగించే అంశం.  

వారణాసిలో బీజేపీ ఓటమి ప్రతిపక్షాలకు ఒక నారెటివ్​ను అందించినట్లే అని విశ్లేషకుల అభిప్రాయం.  ప్రధాని మోదీ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ  ఓడిపోవడం, జాతీయ స్థాయిలో దాన్నొక ప్రచారాంశంగా మార్చే పనిలో ప్రతిపక్షాలు ఎలాగూ ఉంటాయి.   ఇది బీజేపీకి ఇరకాటంగా మారిన  ఫలితమనే  చెప్పాలి. 

వారణాసి నుంచి నాగపూర్​దాకా వెంటాడిన  ఓటమి

2024 వారణాసి లోక్​సభ ఎన్నికల  లెక్కింపులో  మొదటి కొన్ని రౌండ్ల వరకు మోదీ వెనుకబడిన విషయం తెలిసిందే. అలాంటి వారణాసి లోక్​సభ నియోజకవర్గంపై బీజేపీ ఎన్నడూ  సమీక్షించుకొని తప్పులను సరిదిద్దుకున్నట్లు లేదు. అందుకే, ఇపుడు అదే వారణాసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఓటమి తప్పలేదేమో! 

ఒక ప్రధాని నియోజకవర్గంలో ప్రజలు  అసంతృప్తిగా ఉండడం చాలా అరుదు.  ప్రధానిగా మోదీ వారణాసిని బాగా అభివృద్ధి చేసినమాట  కూడా నిజం. అయినా వారణాసి (కాశీ)తోపాటు, ఆగ్రా(మధుర), ప్రయాగ్​రాజ్​(త్రివేణి సంగమం), చివరకు మహారాష్ట్రలో ఆర్ఎస్​ఎస్​ హెడ్​క్వార్టర్​ ఉన్న నాగపూర్​లో  కూడా  బీజేపీ  ఓటమి పాలు కావడానికి ఏవో కనిపించని కారణాలు లేకపోలేదు. 

అయోధ్యలో అక్రమాలు బయటపడినప్పటి నుంచే బీజేపీ కాస్త డిఫెన్స్​లోకి వెళ్లింది. అలాగే నీట్​ పేపర్ ​లీకుల ప్రభావంతో  యువతలో  కొంత వ్యతిరేకత పెరగడం, అలాగే, యూజీసీ ప్రభావంలో అగ్రవర్ణాలు బీజేపీకి కొంతదూరం కావడం .. అవన్నీ కలిసి బీజేపీని కొంత కాలంగా డిఫెన్స్​లోకి నెడుతూ వస్తున్నాయని చెప్పాలి. వాటన్నిటి  ఫలితమే వారణాసి, ఆగ్రా, ప్రయాగ్​రాజ్​ నుంచి నాగపూర్​ దాకా ఓటములు  కనిపిస్తున్నాయని ఎందుకు అనుకోకూడదో ఆ పార్టీయే ఆత్మ పరిశీలన  చేసుకోవాలి.

 నిజానికి ఈ కారణాలన్నిటికీ రాష్ట్రంలోని యోగి ప్రభుత్వం మాత్రం కారణం కాదు, కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే కారణమని యూపీ ప్రజలకూ తెలుసు. అందుకే యూపీలో బీజేపీ 6 స్థానాలు గెలవగలిగిందంటే యోగి పాలన పట్ల ఉన్న సానుకూలత  కలిసొచ్చిందని  భావించొచ్చు.  కాబట్టి రేపు ఉత్తరప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే  అది యోగి వల్లనే కావచ్చు, అధికారం కోల్పోతే మాత్రం పరోక్షంగా  మోదీయే  కారణం కావచ్చు.

పాపులారిటీ ఓటుగా మారలేదు

ఇక కాంగ్రెస్​ గురించి చెప్పుకోవాలంటే..  రాహుల్​ గాంధీ  అన్ని  విషయాలను వదిలేసి, ‘ఓట్​ చోరీ’ ఉద్యమంలో  నిమగ్నమైపోయారు. కొన్ని నెలల నుంచి అదే పనిగా ఆ ఉద్యమం నడుపుతున్న రాహుల్​ గాంధీ, వెనక్కి తిరిగి చూస్తున్నట్లు కూడా లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూపీలో పోటీ చేయకుండా  మిత్రపక్షానికి వదిలేశారు. 

బిహార్​లో కొన్ని స్థానాల్లో పోటీ చేసినా ఒక్క గెలుపు కూడా దక్కలేదు. కర్నాటకలో అధికారంలో ఉండి కూడా ఒక్క సీటూ గెలవక పోవడం కాంగ్రెస్​ పార్టీకి శరాఘాతం. నిజానికి ఎస్ఐఆర్​ సమస్యపై, సీఈసీ  జ్ఞానేశ్​ కుమార్​ రాజీనామాపై   రాహుల్​ కొనసాగిస్తున్న  మూవ్​మెంట్‌‌తో  ఆయన పొలిటికల్​ పాపులారిటీ  మునుపటి కన్నా పెరిగి ఉండొచ్చు. కానీ అది పార్టీగా కాంగ్రెస్​ అందుకోలేకపోతుందనే చెప్పాలి. 

దేశవ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ 12 స్థానాల్లో పోటీచేసి, ఒక్క స్థానాన్ని మాత్రమే గెలవడం చూస్తే.. రాహుల్​కు పెరిగిన పాపులారిటీ ఆయన  పార్టీకి  ఓటుగా మారలేదని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే చెపుతున్నాయి. 

పాపులారిటీ  నిలకడగా ఉండాలంటే!

రాహుల్​ పాపులారిటీ మునుపటికన్నా పెరిగిందని సీ ఓటర్​  ట్రాకర్​ సర్వే కూడా చెప్పింది. మోదీ, రాహుల్​ మధ్య ఒక దశలో 30 శాతం తేడా ఉండేదంటుంది. ఆ తర్వాత అది 20 శాతానికి తగ్గిందని, ఇపుడది మరింత తగ్గిందని చెపుతోంది.  అంటే మోదీ పాపులారిటీకి రాహుల్ పాపులారిటీ మరింత చేరువగా ఉందని,  అయినా మోదీ పాపులారిటీ ఇప్పటికీ టాప్​లోనే కొనసాగుతోందని ఆ ట్రాకర్​ సర్వే చెపుతోంది. 

కేజ్రీవాల్, మమతాబెనర్జీ  రేటింగ్‌‌లు​ పడిపోవడం .. రాహుల్ పాపులారిటీ పెరగడానికి ప్రధాన కారణమని కూడా ఆ సర్వే చెపుతోంది. దీంతో ప్రతిపక్ష శిబిరానికి నాయకత్వం వహించాలనే రాహుల్ వ్యూహం కొంతవరకు ఫలిస్తున్నట్లే.  ఆయనకు పెరిగిన పాపులారిటీ నిలకడగా ఉంటుందా? ఇకపై ఆయన వ్యూహం ఎలా ఉంటుంది?  అదంతా రాజకీయంగా ఆయనకు కలిసొచ్చే అంశాలపై మాత్రమే ఆధారపడే అవకాశం ఉంది.

అసలు సమస్యలపై దృష్టి  ఏది?

నీట్ వివాదం , అయోధ్య , యూజీసీ  వివాదం ఇవన్నీ బీజేపీ ఓటర్లను కూడా ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. న్యూట్రల్​ ఓటర్లను సైతం ఇవే అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. బీజేపీని ఈ ఆంశాలే  డిఫెన్స్​లో పడేస్తూ వస్తున్నాయి. బీజేపీపై ఎస్ఐఆర్​ కంటే, ఈ మూడు అంశాలే ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి.  

బీజేపీని  రాజకీయంగా బాగా ఇబ్బంది పెడుతున్న అంశాలు ఏవైనా ఉన్నాయంటే  ప్రధానంగా ఆ మూడే!  కానీ ఇపుడు రాహుల్ గాంధీ దృష్టి మొత్తం ఓట్​ చోరీ  మూవ్​మెంట్​పై పెట్టి అసలు సమస్యలను ​ వదిలేస్తున్న  పరిస్థితి కనిపిస్తోంది.  యువతకు  ఉద్యోగాలు, నిరుద్యోగం,  అస్తవ్యస్త  ఆర్థిక వ్యవస్థ అంశాలు వెనకబడిపోతున్నాయి. 

 ఓట్​చోరీ  అంశం నీట్ వివాదం లాంటిది కాదు,  అయోధ్య వంటి అంశం కాదు,  నిరుద్యోగ సమస్య కాదు,  ఆర్థిక సమస్య అంతకన్నా కాదు. ఓట్ చోరీ అనే అంశం రాజకీయంగా ఒక రాజకీయ పార్టీని ఉత్తేజ పరచగలిగేంత వరకే పనిచేస్తున్నది. అందుకే, ఎమ్మెల్సీ ఫలితాలను  ఇతర సమస్యలు ప్రభావితం చేసినంతగా, ఓట్ చోరీ ప్రభావితం చేయలేకపోయింది.

- కల్లూరి శ్రీనివాస్​రెడ్డి,సీనియర్​ జర్నలిస్ట్​-

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.