- క్షేత్రస్థాయి అమలే ముఖ్యమన్న ధర్మాసనం
న్యూఢిల్లీ : బాణసంచాపై పూర్తిగా నిషేధం విధించేందుకు సుప్రీంకోర్టు సుముఖంగా లేదు. ఏటా కేవలం ఉత్తర్వులు జారీ చేయడం వల్ల ప్రయోజనం లేదని, వాటిని క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు చేయాలని సర్వోన్నత ధర్మాసనం తేల్చిచెప్పింది. ఢిల్లీ- నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) ప్రాంతంలో కాలుష్యానికి కారణమవుతున్న టపాసుల వినియోగానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
ఉత్తర్వులు ఇస్తే సరిపోదు..
న్యాయమూర్తులు మాట్లాడుతూ.. ఏటా కేవలం కాగితాలపై ఉత్తర్వులు ఇస్తూ పోతే అది అపహాస్యంమవుతుందని, క్షేత్రస్థాయిలో అమలు జరగనప్పుడు ఆదేశాలు ఇవ్వడంలో అర్థం లేదని స్పష్టం చేశారు. దీన్ని తాము ఓ కక్షపూరిత వ్యాజ్యంగా చూడడం లేదని, అధికార వర్గాలు ఈ సమస్యను సీరియస్‌గా తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల మనోభావాలను తాము అర్థం చేసుకోగలమని, అందుకే పూర్తి నిషేధం విధించే ఆలోచన చేయలేదని ధర్మాసనం పేర్కొంది.
కానీ తమను అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకునేలా బలవంతం చేయవద్దని హెచ్చరించింది. కాలుష్య నియంత్రణ కోసం అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ఏం జరుగుతుందో పరిశీలించాలని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు క్రీడాకారులు, తదితర ప్రముఖుల సేవలను ఎందుకు ఉపయోగించుకోకూడదని ధర్మాసనం ప్రశ్నించింది.
కాలుష్య నివారణకు ప్రత్యేక ఏర్పాట్లు
ఢిల్లీ ప్రభుత్వం, వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (సీఏక్యూఎం) తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపిస్తూ.. కాలుష్య సీజన్‌ను ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం విస్తృతమైన ప్రణాళికను సిద్ధం చేసిందని తెలిపారు. నవంబర్ నుంచి పాత వాహనాలపై ఆంక్షలు, నిర్మాణ పనుల నిలిపివేత, ఆఫీసు వేళల్లో మార్పులు వంటి చర్యలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు.
బాణసంచాలో బేరియం వినియోగానికి సంబంధించి అంతర్గత సంప్రదింపులు జరుగుతున్నాయని, దీనికోసం మరో మూడు వారాల సమయం కావాలని ఆమె కోరగా.. తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.
