- ‘స్పందన’ సేవలకు 7, శాంతి భద్రతల విధులకు 8 కేటాయింపు
- ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ సిటీ పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా నగరంలో 15 ఎలక్ట్రిక్ స్మార్ట్ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. పేట్లబురుజులోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ గురువారం ఈ వెహికల్స్ ను జెండా ఊపి ప్రారంభించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల తక్షణ రక్షణ కోసం పనిచేసే ‘స్పందన’ బృందాలకు 7, శాంతిభద్రతల పెట్రోలింగ్ విధులకు 8 చొప్పున ఈవీ కార్లను కేటాయించారు.
సీఎస్సార్ కింద హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్‌సీఎస్‌సీ) వీటిని సమకూర్చింది. ఈ వాహనాలు ఒక్కసారి చార్జ్ చేస్తే 468 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయని పోలీస్అధికారులు తెలిపారు. డీఆర్డీవో, కంట్రోల్ రూమ్ వ్యవస్థతో వీటిని పక్కాగా సమన్వయం చేస్తూ, కాల్ రాగానే క్షణాల్లో ఘటనాస్థలికి చేరుకునేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
