- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
- పెద్దపల్లి మండలం రాఘవాపూర్ దళితులకు పరామర్శ
పెద్దపల్లి, వెలుగు: రాష్ట్రంలో రోజు రోజుకు దళితులపై దాడులు, కుల వివక్ష సంఘటనలు పెరిగిపోతున్నాయని, దీన్ని ఏమాత్రం సహించేది లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ గ్రామంలో ఇటీవల దాడులకు గురైన దళితులను గురువారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాఘవపూర్ లో పోలీసు అధికారులే నిందితుల పక్షాన నిలిచి బాధితులను వేధించడం, కొట్టడం సరికాదన్నారు. ఇందుకు బాధ్యుడైన పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
గ్రామంలో జరిగిన గొడవ విషయంలో ఇరువర్గాలు మధ్య రాజీ కుదిరిన తర్వాత కూడా ఓ నాయకుడి ప్రోద్బలంతో యువకులపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం అన్యాయమన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ వారికి తమ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు భూపాల్, అబ్బాస్, రమణ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రవల్లి ముత్యంరావు, జి. జ్యోతి, కల్లేపల్లి అశోక్, సిపెల్లి రవీందర్, మోదుంపల్లి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
