- అత్యధిక లోటు వర్షపాతం ఉన్న మండలాలు జాబితాలో లేవు
- మొక్కుబడిగా మండలాల జాబితా ప్రకటించారన్న బండి సంజయ్
కరీంనగర్ టౌన్, వెలుగు: కరువు మండలాల జాబితాలో కరీంనగర్పార్లమెంట్ నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు.
క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా మొక్కుబడిగా ప్రకటన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరువు మండలాల ప్రకటనలో వివక్ష ఎందుకు ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు.
హుస్నాబాద్, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో అనేక మండలాల్లో కరువు పరిస్థితులు కన్పించడం లేదా అని ప్రశ్నించారు. -35శాతం లోటు వర్షపాతం ఉన్న మండలాలు కూడా కరువు జాబితాలో లేకపోవడం బాధాకరమన్నారు.
పొలాలన్నీ బీళ్లుగా మారి తాగునీటికి ఇబ్బంది పడుతుంటే పట్టించుకోరా అని నిలదీశారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో అత్యధిక మండలాలు కరువు జాబితాలోకి వచ్చే అర్హత ఉన్నాయన్నారు. కరువు మండలాలను ఎంపిక చేసేందుకు ఉపయోగించిన అధికారిక గణాంకాలు, ప్రామాణాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర సగటు వర్షపాతాన్ని మాత్రమే కాకుండా, ప్రతి మండలంలోని వర్షపాతం, పంటల పరిస్థితిని విడివిడిగా పరిశీలించాలన్నా. ఒక మండలంలో వర్షం కురిసిందని, పక్క మండలంలోనూ అదే పరిస్థితి ఉందని భావించడం శాస్త్రీయ పద్ధతి కాదన్నారు.
అర్హత ఉన్న మండలాలను జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా వాస్తవికత ఆధారంగా కరువు మండలాలను ప్రకటించాలన్నారు. పేదలకు పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించాలని, రైతులకు అన్యాయం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
