Aadarsha Kutumbam Review: వెంకీ మాస్ మ్యాజిక్.. అదిరిపోయిన ఇంటర్వెల్ బ్లాక్.. ఓవరాల్ సినిమా ఎలా ఉందంటే?

Aadarsha Kutumbam Review: వెంకీ మాస్ మ్యాజిక్.. అదిరిపోయిన ఇంటర్వెల్ బ్లాక్.. ఓవరాల్ సినిమా ఎలా ఉందంటే?

టాలీవుడ్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’ (AK47) అక్టోబర్ 30, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించగా.. నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించారు. తమన్ సంగీతం అందించారు.

ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ రివ్యూలు పంచుకుంటున్నారు. ముఖ్యంగా వెంకటేశ్ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ మార్క్ రైటింగ్, అదిరిపోయే ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకు హైలైట్స్‌గా నిలుస్తున్నాయని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ‘ఆదర్శ కుటుంబం’ ఎలా ఉంది? వెంకీ-త్రివిక్రమ్ కాంబో ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అనేది ట్విట్టర్ టాక్‌లో తెలుసుకుందాం..

ఆదర్శ కుటుంబం కథేంటి?

చిట్టిబాబు (వెంకటేశ్) ఓ సాధారణ మధ్యతరగతి వ్యక్తి. తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలనే లక్ష్యంతో జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటుంటాడు. భార్య స్వర్ణ (శ్రీనిధి శెట్టి) చేసే వ్యాపారంలో ఎదురయ్యే నష్టాలు, కుటుంబ ఖర్చులు, పిల్లల బాధ్యతల మధ్య అతడి జీవితం సాగుతుంటుంది. అయితే, అనుకోకుండా అదృష్టం కలిసిరావడంతో ఆర్థికంగా ఎదిగి 47వ నంబర్ విల్లాలోకి అడుగుపెడతాడు.

కానీ, కొత్త ఇంట్లోకి వెళ్లిన తర్వాత చిట్టిబాబు కుటుంబానికి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఓ ప్రమాదకరమైన నేరగాళ్ల ముఠా వారి జీవితాల్లోకి ప్రవేశించడంతో కథ అనూహ్య మలుపులు తిరుగుతుంది. అసలు ఆ ముఠా లక్ష్యం ఏమిటి? చిట్టిబాబు కుటుంబానికి ఆ గ్యాంగ్‌తో సంబంధం ఏంటి? తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చిట్టిబాబు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అనేదే సినిమా మిగతా కథ.. 

పోలీస్‌ vs కుటుంబం.. 

ఈ సినిమాలో నారా రోహిత్‌ పోలీస్‌ అధికారిగా కనిపించడం మరో ముఖ్యమైన అంశం. ఒకవైపు నేరగాళ్ల ముఠా, మరోవైపు ఆ కేసును పరిశోధించే పోలీస్‌ అధికారి, ఇంకోవైపు తన కుటుంబాన్ని కాపాడుకోవాలనుకునే చిట్టిబాబు.. ఈ మూడు కోణాలు కథలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. పోలీసుల దృష్టిలో చిట్టిబాబు కుటుంబం అనుమానాస్పదంగా మారుతుందా? నేరగాళ్ల నుంచి తప్పించుకునే క్రమంలో ఆ కుటుంబం మరింత చిక్కుల్లో పడుతుందా? లేక చిట్టిబాబే ఊహించని రీతిలో ఎదురుదాడికి దిగుతాడా వంటి క్రైమ్‌, యాక్షన్‌ అంశాలు ఆడియన్స్ లో ఆసక్తిరేపుతున్నాయి.

వెంకీ వన్‌లైనర్స్‌తో రచ్చ.. ఇంటర్వెల్ బ్లాక్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్..

‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ హాఫ్ టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. విక్టరీ వెంకటేశ్ తనదైన కామెడీ టైమింగ్‌తో మరోసారి అదరగొట్టారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. స్టార్టింగ్‌లో కథ కాస్త రొటీన్‌గా అనిపించినా.. కథనం ముందుకు సాగేకొద్దీ అసలు గేమ్ మొదలవుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా వెంకీ మార్క్ వన్‌లైనర్స్, ఫ్యామిలీ హ్యూమర్ సీన్స్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్, ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయని నెటిజన్లు అంటున్నారు. సెకండాఫ్‌లో అక్కడక్కడా ల్యాగ్ ఉన్నప్పటికీ.. స్క్రీన్‌ప్లే, కథాంశం కొత్తగా అనిపించాయని.. అద్భుతాలు చేసే సినిమా కాకపోయినా.. చివరి వరకు ఆసక్తికరంగా సాగుతుందని ఆడియాన్స్ రివ్యూలు చెబుతున్నాయి.

ఆదర్శ కుటుంబంపై క్రేజీ టాక్..

‘లాజిక్ లేదు.. మ్యాజిక్ ఉంది’ అంటూ ఓ నెటిజన్ ఇచ్చిన కామెంట్ ఇప్పుడు సినిమా ఫస్ట్ హాఫ్ టాక్‌లో ప్రత్యేకంగా నిలుస్తోంది. వెంకటేశ్, శ్రీనిధి శెట్టి జోడీ, విలన్ గ్యాంగ్ ఎంట్రీ, ఫ్యామిలీ కామెడీ సీన్స్, తమన్ బీజీఎం, త్రివిక్రమ్ రైటింగ్ అదిరిపోయాయని సదరు నెటిజన్ పేర్కొన్నాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ నెక్స్ట్ లెవల్‌లో ఉందని, సినిమా ఆద్యంతం ఎంగేజింగ్‌గా సాగిందని అభిప్రాయపడ్డాడు.

మరోవైపు, ‘ఫ్యామిలీ మూవీస్‌లోనే బెస్ట్ ఇంటర్వెల్ బ్లాక్స్‌లో ఒకటి’ అంటూ మరో నెటిజన్ ప్రశంసలు కురిపించాడు. సినిమా మొదట లైట్‌హార్టెడ్‌గా సాగుతూ.. ప్రీ-ఇంటర్వెల్ నుంచి ఊహించని మలుపు తీసుకుంటుందని పేర్కొన్నాడు. వెంకటేశ్ ఎనర్జీ, వన్‌లైనర్స్, తమన్ బీజీఎం అదిరిపోయాయని చెప్పుకొచ్చాడు.

వెంకీ కామెడీకి ఫ్యాన్స్ ఫిదా.. తమన్ BGMకు ఫుల్ మార్క్స్..

‘ఆదర్శ కుటుంబం’లో వెంకటేశ్ తనదైన కామెడీ టైమింగ్‌తో సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని రివ్యూలు చెబుతున్నాయి.  తొలి స్పందనలు సూచిస్తున్నాయి. ఫ్యామిలీ హ్యూమర్, హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ, విలన్ గ్యాంగ్ ఇంట్రడక్షన్‌తో పాటు కీలక సన్నివేశాల్లో తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా హైలైట్స్‌గా నిలుస్తున్నాయని టాక్.

వెంకటేశ్ నటన, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, తమన్ బీజీఎం, అదిరిపోయిన ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకు ప్రధాన బలాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ దగ్గర కథ తీసుకునే టర్న్ సెకండ్ హాఫ్‌పై క్యూరియాసిటీని పెంచుతోంది.