మీ పెట్టుబడులకు   నేను కాపలా  అభిప్రాయాలు వింటం.. స్పీడ్ బ్రేకర్లు తీసేస్తం: సీఎం రేవంత్

మీ పెట్టుబడులకు   నేను కాపలా  అభిప్రాయాలు వింటం.. స్పీడ్ బ్రేకర్లు తీసేస్తం: సీఎం రేవంత్
  • పారిశ్రామికవేత్తలకు  సీఎం రేవంత్​రెడ్డి భరోసా
  • తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పిలుపు
  • 400 ఏండ్ల క్రితమే హైదరాబాద్​ గ్లోబల్​ సిటీ
  • సంస్కరణలు, వ్యాపార దార్శనికత మా రక్తంలోనే ఉంది
  • దేశంలోని ఏడు బుల్లెట్ రైల్ కారిడార్లలో  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కే మూడు
  • అభివృద్ధిలో రాజకీయాలు లేవు.. కేంద్రంతో కలిసి పనిచేస్తున్నం
  • ఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ సమిట్ కర్టెన్ రైజర్​లో సీఎం రేవంత్
  • కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​, రాష్ట్ర మంత్రులు వివేక్​ వెంకటస్వామి, దుద్దిళ్ల శ్రీధర్​ బాబు, వాకిటి శ్రీహరి హాజరు 

 

హైదరాబాద్, వెలుగు:  400 ఏండ్ల నుంచి  గ్లోబల్​ సిటీగా ఉన్న హైదరాబాద్​లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకురావాలని సీఎం రేవంత్​రెడ్డి పిలుపునిచ్చారు. ‘ తెలంగాణలో ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో పెట్టండి.. మీకు అన్ని విధాలా సహకరిస్తాం.. మీ పెట్టుబడికి భద్రత, మీ ఎదుగుదలకు హామీ ఇస్తాం.. మీ  పెట్టుబడులకు నేనే స్వయంగా కాపలాదారుడిగా ఉంటా..’ అని సీఎం భరోసా ఇచ్చారు.  డిసెంబర్​ 7, 8, 9వ తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్​ సమిట్​ ఈవెంట్​పై గురువారం ఢిల్లీలో కర్టన్​ రైజర్​ కార్యక్రమాన్ని నిర్వహించారు.  

సీఎం రేవంత్​ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​, రాష్ట్ర మంత్రులు శ్రీధర్​ బాబు, వివేక్​ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్​ మాట్లాడారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు గ్లోబల్ టాలెంట్‌‌‌‌‌‌‌‌ను సృష్టించే సత్తా ఎల్లప్పుడూ హైదరాబాద్ సొంతమని చెప్పారు. ‘హైదరాబాద్ గాలి, నీటిలోనే గ్లోబల్ విజన్ ఉంది.. సంస్కరణలు, వ్యాపార దార్శనికత ఇక్కడి రక్తంలోనే ఉంది..’ అని స్పష్టం చేశారు. 1991 నుంచి ఎన్నో రాజకీయ పార్టీలు, వేర్వేరు భావజాలాలు కలిగిన నేతలు రాష్ట్రాన్ని పాలించినప్పటికీ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హైదరాబాద్ అభివృద్ధికి, పెట్టుబడుల ప్రయాణానికి బాసటగా నిలిచారని సీఎం రేవంత్​రెడ్డి గుర్తు చేశారు.

400 ఏండ్ల క్రితమే హైదరాబాద్​ గ్లోబల్​సిటీ.. 

దేశంలో గ్లోబల్ అనే పదాన్ని వాడడానికి వందల ఏండ్ల ముందే అంటే దాదాపు 400 ఏండ్ల క్రితమే హైదరాబాద్ గ్లోబల్​ సిటీగా విలసిల్లిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఆ కాలంలోనే ఓల్డ్​ సిటీలో గ్లోబల్​ మార్కెట్​ నడిచేదన్నారు. అనేక దేశాల వ్యాపారులు చార్మినార్ వద్దకు వచ్చి ముత్యాలు, అత్తర్లు, వెండి నగిషీలను కొనుగోలు చేసేవారని చెప్పారు.
 
నిజాం కాలంలో అద్భుతమైన కట్టడాలు, ప్రపంచ స్థాయి మ్యూజియం, మింట్ కాంపౌండ్​, ఎయిర్​పోర్ట్​, రైల్వేలు, అత్యుత్తమ విద్యా సంస్థలతో హైదరాబాద్‌‌‌‌ను నిర్మించారన్నారు. నిజాం ఏర్పాటు చేసిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌‌‌‌పీఎస్).. నేడు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా, అడోబ్ సీఈవో శాంతను నారాయణ్, ప్రముఖ వ్యాపారవేత్త ప్రేమ్ వత్స వంటి గ్లోబల్ లీడర్లను ప్రపంచానికి అందించిందని కొనియాడారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, గ్లోబల్ టాలెంట్‌‌‌‌ను సృష్టించే సత్తా ఎల్లప్పుడూ హైదరాబాద్ సొంతమన్నారు. భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో దేశాన్ని మలిచిన మహనీయులను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం  చెప్పారు. దేశంలో అతిచిన్న వయస్సులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ.. కంప్యూటర్, టెలికం విప్లవానికి నాంది పలికారని, అలాగే 1991లో తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు ప్రధానిగా ఎల్‌‌‌‌పీజీ (సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ) సంస్కరణలతో నూతన ఆర్థిక శకానికి పునాది వేశారన్నారు. 

మీ ఆలోచనలే మా పాలసీలు.. స్పీడ్ బ్రేకర్లు తీసేస్తా

తాను ఇక్కడికి సుదీర్ఘ ఉపన్యాసాలు ఇవ్వడానికి రాలేదని, పెట్టుబడిదారుల మాటలు వినడానికే వచ్చానని రేవంత్ రెడ్డి చెప్పారు. ‘‘ వ్యాపారం గురించి మీకే బాగా తెలుసు. మీ అభిప్రాయాలు వింటాం.. నేర్చుకుంటాం. అర్థం చేసుకుంటాం. అమలు చేస్తాం. కొలవలేని దాన్ని నిర్వహించలేం అని నేను నమ్ముతా. అభివృద్ధి వేగవంతం కావాలంటే ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండాలి. మీ విజయ పథంలో ఎదురయ్యే స్పీడ్ బ్రేకర్లను తొలగించడమే నా అసలైన బాధ్యత. మీకు ఎలాంటి పాలసీ మద్దతు కావాలన్నా నేను వ్యక్తిగతంగా గ్యారెంటీ ఇస్తా. మీ ఆలోచనలు, పాలసీ ఇన్‌‌‌‌పుట్స్ పంచుకోండి.. వాటినే మా ప్రభుత్వ విధానాలుగా మారుస్తాం’’ అని ఇన్వెస్టర్లకు సీఎం పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి అనుగుణంగానే తమ ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌‌‌‌ను రూపొందించిందని సీఎం వివరించారు.  రాష్ట్రాన్ని 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల మహా ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

కేంద్రంతో పూర్తి సమన్వయం.. 

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో ఇరువురి సంబంధాలపై పలువురు ఇన్వెస్టర్లు సందేహాలు వ్యక్తం చేస్తుంటారని, కానీ అభివృద్ధి, ప్రజా సేవ విషయంలో తమకు ఎలాంటి రాజకీయాలు లేవని సీఎం రేవంత్​ తేల్చిచెప్పారు. ఈ సదస్సు వేదికపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వయంగా పాల్గొనడమే ఇందుకు నిదర్శనమన్నారు. కేంద్రం దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన 7 హైస్పీడ్ రైలు (బుల్లెట్ రైలు) కారిడార్లలో  3 కారిడార్లు (హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–పుణె) హైదరాబాద్‌‌‌‌కే దక్కాయని వివరించారు. వరంగల్, ఆదిలాబాద్‌‌‌‌లలో రెండు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్రం సంపూర్ణ మద్దతు ఇస్తోందన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్), మెట్రో రైలు విస్తరణ, నేవీకి చెందిన అత్యంత కీలకమైన లో-ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ (వీఎల్‌‌‌‌ఎఫ్)తో పాటు కేంద్ర పథకాల అమలులో కేంద్ర ప్రభుత్వంతో పూర్తి సమన్వయంతో ముందుకెళ్తున్నామని తెలిపారు.

 న్యూయార్క్, లండన్​తోనే మా పోటీ

హైదరాబాద్‌‌‌‌కు దేశంలోని ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలు ఏమాత్రం పోటీ కావని, తమ పోటీ న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ వంటి అంతర్జాతీయ నగరాలతోనేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ‘‘తెలంగాణ రైజింగ్​.. ఈ ప్రస్థానంలో మీరూ భాగస్వాములు కండి. మనమందరం కలిసి పనిచేసి సరికొత్త చరిత్రను లిఖిద్దాం’’ అంటూ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిం చారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ మహా సదస్సుకు తరలిరావాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.