బీసీ భవన నిర్మాణాలకు కొత్త గైడ్ లైన్స్..

బీసీ భవన నిర్మాణాలకు కొత్త గైడ్ లైన్స్..
  • బీసీ వెల్ఫేర్ మంత్రి చైర్మన్ గా మేనేజ్ మెంట్ కమిటీ
  • కమిటీలో కుల సంఘం ప్రతినిధి
  • భూమి, భవనం అమ్మడం, సబ్ లీజు, తాకట్టు నిషేధం 

హైదరాబాద్, వెలుగు: బీసీ ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా గురువారం జీవో విడుదల చేశారు. గతంలో జారీ చేసిన అన్ని రకాల ఉత్తర్వులు, నిబంధనలను రద్దు చేస్తూ ఈ కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఆత్మగౌరవ భవనాల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి ఐదుగురు సభ్యులతో మేనేజ్ మెంట్  కమిటీ ఏర్పాటు చేసింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చైర్మన్ గా, ప్రిన్సిపల్ సెక్రటరీ, కుల సంఘాల నుంచి ఒక ప్రతినిధి, బీసీ వెల్ఫేర్ కమిషనర్, బీసీ కార్పొరేషన్ ఎండీ మెంబర్లుగా ఉన్నారు. ఈ కమిటీ టర్మ్ మూడేళ్ల పాటు అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

అమ్మకం, లీజు నిషేదం

బీసీ ఆత్మగౌరవ భవనాలకు సంబంధించి భూమిని, బిల్డింగ్ ను, మేనేజ్‌‌‌‌మెంట్ కమిటీ కేవలం రోజువారీ నిర్వహణ, సంరక్షణ చూసే కస్టోడియన్‌‌‌‌గా మాత్రమే వ్యవహరించాలి. ఈ భూములు లేదా భవనాలను ప్రైవేట్ వ్యక్తులకు, సంస్థలకు అమ్మడం, తాకట్టు పెట్టడం, సబ్- లీజుకు ఇవ్వడం లేదా బదలాయించడం పూర్తిగా నిషిద్ధం. ఎలాంటి చట్ట వ్యతిరేక, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు అనుమతి ఉండదు.

రాజకీయ సమావేశాలు, మతపరమైన కార్యకలాపాలు నిర్వహించరాదు. కేవలం కుల సమావేశాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే ముందస్తు నోటీసు లేకుండానే మేనేజ్‌‌‌‌మెంట్ కమిటీని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

 బీసీ ఆత్మగౌరవ భవానికి కేటాయించిన భూమి విస్తీర్ణం, నిధులు, ప్రభుత్వ ముందస్తు అనుమతికి లోబడి బీసీ ఆత్మ గౌరవ భవనాల భూములను పలు ప్రయోజనాల కోసం వినియోగించుకోవచ్చు. వీటిలో కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్ హాల్స్, ఆడిటోరియంలు, మల్టీపర్పస్ హాల్స్, లైబ్రరీలు, రీడింగ్ రూమ్‌‌‌‌ల నిర్మాణాలు చేపట్టవచ్చు.  

ప్రతి 3 నెలలకొకసారి బోర్డు మీటింగ్​

మేనేజ్‌‌‌‌మెంట్ కమిటీ ప్రతి 3 నెలలకు ఒకసారి బోర్డు మీటింగ్ నిర్వహించి, ఆ సమావేశపు వివరాలను  బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌‌‌‌కు సమర్పించాలి.  ఈ భవనాల నిర్మాణాలను టీజీఈడబ్ల్యూఐడీసీ వంటి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా మాత్రమే చేపట్టాలి. కమ్యూనిటీ సంప్రదాయాలు, భూమి లభ్యత, నిధుల ఆధారంగా ప్లాన్, డిజైన్, అంచనాలు రూపుదిద్దుకుంటాయి.

కొత్త భవనాల నిర్మాణం లేదా పాత భవనాల నిర్మాణ మార్పులకు ప్రభుత్వ ఆమోదంతో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ అనుమతి ఇస్తారు. విరాళాలు ఇచ్చిన దాతల పేర్లను భవనంలో ప్రదర్శించాలి. కమ్యూనిటీ సొంత నిధులతో నిర్మించే భవనాలకు కూడా ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.