తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026: సెమీకండక్టర్ మిషన్ 2.0లో భాగస్వాముల్ని చేయండి..కేంద్రానికి మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్  2026: సెమీకండక్టర్ మిషన్ 2.0లో  భాగస్వాముల్ని చేయండి..కేంద్రానికి మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి

హైదరాబాద్​, వెలుగు: సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎమ్) 2.0లో తెలంగాణను భాగస్వామ్యం చేయాలని ఐటీ, ఇండస్ట్రీస్​ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఫ్యాబ్ ఇండస్ట్రీ, చిప్ డిజైన్ విభాగాల్లోనూ తెలంగాణ అగ్రగామిగా ఎదిగేందుకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్నారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్  2026 కర్టెన్ రైజర్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. 

రాష్ట్ర డిఫెన్స్ ఎగుమతులు గతంతో పోలిస్తే 103 శాతం పెరిగాయన్నారు. రాష్ట్రంలో డేటా సెంటర్ల సామర్థ్యాన్ని 2030 నాటికి 5 గిగావాట్లకు చేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి చేర్చాలనే సంకల్పంతోనే గతేడాది తెలంగాణ రైజింగ్  విజన్ కు శ్రీకారం చుట్టామన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, టాలెంట్ పూల్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా అమలు చేస్తున్న విధానాలు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఊతమిస్తున్నాయన్నారు.