- ఎంపీ ఆర్.కృష్ణయ్య
- విద్యానగర్ నుంచి నల్లకుంట వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్స్కీంను పాత పద్ధతిలోనే కొనసాగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. వివిధ కాలేజీల్లో చదువుతున్న 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు బకాయిలు రూ.8,500 కోట్లను వెంటనే చెల్లించాలన్నారు. ఈ మేరకు బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్ మోడీ రామ్ దేవ్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లోని విద్యానగర్ నుంచి నల్లకుంట కూరగాయల మార్కెట్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో 6 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లోనే ఉండిపోయాయన్నారు. దీంతో వారు ఇటు ఉద్యోగ, అటు ఉన్నత విద్య అవకాశాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కాలేజీ విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లించాలని కోరారు. విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీశ్, నాయకులు నీల వెంకటేశ్, రాజేందర్, శివకుమార్ యాదవ్, బాలయ్య, నిఖిల్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
