ఎట్టకేలకు మార్కెట్లకు లాభాలు..సెన్సెక్స్ 905 పాయింట్లు జూమ్‌‌‌‌‌‌‌‌

ఎట్టకేలకు మార్కెట్లకు లాభాలు..సెన్సెక్స్ 905 పాయింట్లు జూమ్‌‌‌‌‌‌‌‌

22,900 దాటిన నిఫ్టీ
రూ.5 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
ఫెడ్‌‌‌‌‌‌‌‌ వడ్డీ రేట్లను మార్చలే.. 
4 శాతం వద్ద యథాతథం

ముంబై:  గత కొన్ని రోజులుగా అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో కూరుకుపోయిన స్టాక్‌‌‌‌‌‌‌‌ మార్కెట్లు గురువారం పుంజుకున్నాయి.  ఆటోమొబైల్ రంగం మినహా మిగిలిన అన్ని రంగాల్లో  కొనుగోళ్లు  వెల్లువెత్తడంతో  బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు సెన్సెక్స్, నిఫ్టీ ఒక శాతానికి పైగా  ర్యాలీ చేశాయి.  గ్లోబల్ మార్కెట్లు  మిశ్రమంగా ట్రేడవ్వడంతో ఫ్లాట్‌‌‌‌‌‌‌‌గా ఓపెనైన మార్కెట్‌‌‌‌‌‌‌‌,  బ్యాంకింగ్,  ఐటీ రంగాల అండతో  లాభాలబాట పట్టింది.  అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన కీలక వడ్డీ రేట్లను మార్కెట్ అంచనాలకు తగ్గట్లే 3.75 – 4 శాతం వద్ద యథాతథంగా కొనసాగించడం కలిసొచ్చింది.   సెన్సెక్స్ గురువారం  905.01 పాయింట్లు (1.24శాతం) ఎగబాకి 74,151.04 వద్ద ముగియగా,  నిఫ్టీ 237.90 పాయింట్లు (1.05శాతం) లాభపడి కీలకమైన 22,936.75 వద్ద స్థిరపడింది.  నిఫ్టీ మిడ్‌‌‌‌‌‌‌‌క్యాప్, స్మాల్‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు కూడా  చెరో ఒక శాతం లాభపడ్డాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లు పెరిగింది. 

ఆటో తప్ప అన్ని అప్‌‌‌‌‌‌‌‌

మార్కెట్లో కేవలం ఆటోమొబైల్ మినహా మిగిలిన అన్ని రంగాల ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు  గ్రీన్‌‌‌‌‌‌‌‌లో ముగిశాయి. నిఫ్టీ బ్యాంక్, ఎనర్జీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మీడియా, ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రా, ఐటీ, పీఎస్‌‌‌‌‌‌‌‌యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ రంగాలు ఒక్కొక్కటి ఒక శాతం మేర రాణించాయి. మెటల్, ఆయిల్ అండ్‌‌‌‌‌‌‌‌ గ్యాస్, రియల్టీ రంగాలు 0.5 శాతానికి పైగా పెరిగాయి. నిఫ్టీలో అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎటర్నల్ షేర్లు  ఎక్కువగా పెరగగా,  ట్రెంట్, బజాజ్ ఆటో, మారుతీ సుజుకి, ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ లైఫ్, హిందాల్కో   నష్టాల్లో ముగిశాయి. 

ఈ కంపెనీలు అదుర్స్‌‌‌‌‌‌‌‌

సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నికర లాభం రెట్టింపై రూ.68 కోట్లకు చేరడంతో నీల్‌‌‌‌‌‌‌‌కమల్ షేరు ఏకంగా 13 శాతం దూసుకెళ్లింది. రైల్వే శాఖ నుంచి రూ.1,140 కోట్ల విలువైన ఆర్డర్ లభించడంతో జూపిటర్ వ్యాగన్స్ 5 శాతం పుంజుకోగా,  క్వార్టర్లీ  ఫలితాలు బాగుండడంతో  ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ 
9 శాతం జంప్ చేసింది. విదేశీ బ్రోకరేజ్ సంస్థ
సీఎల్ఎస్ఏ రూ.2,300 టార్గెట్‌‌‌‌‌‌‌‌తో ‘ఔట్‌‌‌‌‌‌‌‌పెర్‌‌‌‌‌‌‌‌ఫార్మ్’ రేటింగ్‌‌‌‌‌‌‌‌ను కొనసాగించడంతో హ్యుందాయ్ మోటార్ ఇండియా షేరు 2.5 శాతం పెరిగింది. మరోవైపు అంచనాలకు మించి ఫలితాలు ప్రకటించినా హీరో మోటోకార్ప్ (3శాతం), ఆర్ఆర్ కేబుల్ (3శాతం), హెక్సావేర్ (7శాతం) షేర్లు నష్టాల్లో ముగిశాయి. కోటక్ బ్యాంక్, నైకా, ఇండియన్ హోటల్స్, లారస్ ల్యాబ్స్ సహా 80కి పైగా స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని తాకగా.. యెస్ బ్యాంక్, రామ్‌‌‌‌‌‌‌‌కో సిమెంట్స్ సహా 150కి పైగా షేర్లు 52 వారాల కనిష్టాన్ని తాకాయి. రూపాయి ఇంట్రాడే కనిష్టం 95.37 నుంచి కోలుకుని 95.25 వద్ద స్థిరపడింది.

ఎనలిస్టుల మాట

‘‘మార్కెట్ 22,800 రెసిస్టెన్స్‌‌‌‌‌‌‌‌ను దాటి డైలీ చార్ట్‌‌‌‌‌‌‌‌లో లాంగ్ బుల్లిష్ క్యాండిల్‌‌‌‌‌‌‌‌ను ఏర్పరచింది. ప్రస్తుతం 22,800,  22,750 స్థాయిలు కీలకమైన సపోర్ట్ జోన్లుగా మారాయి.  నిఫ్టీ  వీటి ఎగువన ఉన్నంతవరకు 23,100 - 23,175 స్థాయిల వరకు ర్యాలీ చేసే అవకాశముంది” అని కోటక్ నియో  ఎనలిస్ట్‌‌‌‌‌‌‌‌ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు.  హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి మాట్లాడుతూ,  ఈ మధ్య వోలటాలిటీలో కదిలిన  నిఫ్టీ 22,800 వద్ద బ్రేకౌవుట్ సాధించిందని అన్నారు. డైలీ చార్ట్‌‌‌‌‌‌‌‌లో  ఏర్పడిన బుల్ క్యాండిల్ కొనుగోళ్ల బలాన్ని స్పష్టం చేస్తోందని,  22,400 వద్ద ఏర్పడిన సపోర్ట్  కారణంగా స్వల్పకాలంలో నిఫ్టీ తదుపరి రెసిస్టెన్స్ 23,200 వైపు కదలొచ్చని తెలిపారు.