హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహణ కోసం ఇంటర్మీడియట్ విద్యాశాఖ రూ.2.34 కోట్ల ల్యాబ్ గ్రాంట్లను విడుదల చేసింది. ఈ మేరకు ఇంటర్ విద్య డైరెక్టర్ అభిలాష అభినవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ల్యాబ్ల నిర్వహణ, పరికరాలు, రసాయనాల కొనుగోలుకు ఈ నిధులను వినియోగించనున్నారు. నిధులను నేరుగా కాలేజీల ప్రిన్సిపాళ్లకు కేటాయించారు.
విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఒక్కో కాలేజీకి రూ.24 వేల నుంచి రూ.లక్ష వరకు మంజూరు చేశారు. 500 మందికి పైగా విద్యార్థులున్న కూకట్పల్లి, మహబూబ్నగర్ బాయ్స్, ధర్మసాగర్, నల్లగొండ బాయ్స్ కాలేజీలకు రూ.లక్ష చొప్పున కేటాయించారు. ఇతర కాలేజీలకు విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.80 వేలు, రూ.60 వేలు, రూ.40 వేలు, రూ.24 వేల చొప్పున ఇచ్చారు.
ఈ నిధులను ప్రాక్టికల్స్ నిర్వహణ, ల్యాబ్ సామగ్రి కొనుగోలుకే ఖర్చు చేయాలని అధికారులు స్పష్టం చేశారు. ఖర్చు చేసిన తర్వాత ప్రిన్సిపాళ్లు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీలు) సమర్పించాలని ఆదేశించారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
