సైబర్ బాధితులకు బ్యాంకులే డబ్బు చెల్లించాలి.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు

సైబర్ బాధితులకు బ్యాంకులే డబ్బు చెల్లించాలి.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు

న్యూఢిల్లీ: డిజిటల్ అరెస్ట్, సైబర్ మోసాల బారిన పడి డబ్బులు నష్టపోయిన  బాధితులకు బ్యాంకులే జవాబుదారీగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అకౌంట్లను రక్షించడం బ్యాంకుల ప్రాథమిక బాధ్యత అని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్​ మాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహనల ధర్మాసనం గురువారం తేల్చిచెప్పింది. బ్యాంకుల నిర్లక్ష్యం లేదా డ్యూ డిలిజెన్స్ లోపం వల్ల మోసం జరిగితే, బాధితుడికి జరిగిన పూర్తి నష్టాన్ని ఆ బ్యాంకులే చెల్లించాలని, అవసరమైతే ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

అకౌంట్‌‌‌‌‌‌‌‌ హోల్డర్ల సాధారణ లావాదేవీలకు భిన్నంగా జరిగే అనుమానాస్పద ట్రాన్సాక్షన్లను వెంటనే నిలిపివేయడం, ఆటోమేటెడ్ రిపోర్టింగ్, పోలీసులను అప్రమత్తం చేయడం వంటి ముందస్తు నివారణ చర్యలను తప్పనిసరి చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. సాధారణంగా రూ.10వేల–రూ.20 వేలు విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేసే అకౌంట్‌‌‌‌‌‌‌‌ నుంచి ఒక్కసారిగా భారీ మొత్తం బదిలీ అవుతుంటే బ్యాంకులు ఎందుకు గుర్తించలేకపోతున్నాయని సీజేఐ ప్రశ్నించారు.

 ఈ ఏడాది రూ.800 కోట్ల సైబర్ మోసాలు

 చదువుకున్న వాళ్లు కూడా  'డిజిటల్ అరెస్ట్' భయాల్లో చిక్కుకోవడంపై ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాదితో పోలిస్తే 2026లో  డిజిటల్ అరెస్ట్ కేసులు 50 శాతం తగ్గాయని కేంద్రం కోర్టుకు తెలపగా..  ఈ ఏడాదే దాదాపు రూ.800 కోట్ల మేర సొమ్ము దోపిడీకి గురైందని సీజేఐ గుర్తుచేశారు. సైబర్ నేరగాళ్లు వాడే డొల్ల అకౌంట్లను  కట్టడి చేయడంతో పాటు బ్యాంకుల బాధ్యతను పెంచేలా ఆర్బీఐ రూపొందిస్తున్న కేవైసీ సవరణ నిబంధనలను పరిశీలిస్తామని అన్నారు.