హైదరాబాద్ సిటీ, వెలుగు: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలకు నివాళిగా హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖ గురువారం మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసింది. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులు, తలసేమియా చిన్నారులు, క్యాన్సర్ పేషంట్ల అత్యవసర చికిత్సకు అండగా నిలిచేందుకు నగర వ్యాప్తంగా 38 కేంద్రాల్లో ఈ ప్రోగ్రాం నిర్వహించారు.
పేట్లబురుజులోని సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. పోలీసు అధికారులు, సిబ్బంది, నగర పౌరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. అక్టోబర్21 నుంచి 31 వరకు అమరుల స్మరణార్థం రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమాజ రక్షణ కోసం పండుగలు, సెలవులను సైతం విడిచిపెట్టి పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం పనిచేస్తున్నారని చెప్పారు. రక్తదానాన్ని ఉద్యమంలా చేపట్టడం అభినందనీయమన్నారు. సిటీ పోలీస్‌కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ.. అమరుల త్యాగాలను స్మరిస్తూ వారికి నిజమైన నివాళి అర్పించాలన్న సంకల్పంతోనే కమిషనరేట్ పరిధిలో పెద్దఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన ఉస్మానియా, గాంధీ, నిమ్స్, కింగ్ కోఠి, నిలోఫర్, ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్స్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులకు, రెడ్ క్రాస్, తలసేమియా ఫౌండేషన్, రోటరీ, లయన్స్ క్లబ్ స్వచ్ఛంద సంస్థలకు, రక్తదాతలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఏసీపీ(క్రైమ్) ఎం.శ్రీనివాసులు, అడిషనల్ సీపీ(లా అండ్ ఆర్డర్) తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ(ట్రాఫిక్) జోయల్ డేవిస్, డీసీపీ (సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్) వెంకటేశ్వర్లు, ట్రాఫిక్డీసీపీ రాహుల్ హెగ్డే, విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్యనాయక్ జాదవ్, అన్ని జోన్ల డీసీపీలు, ఇతర అధికారులు, బ్లడ్ బ్యాంకులకు చెందిన డాక్టర్లు, ప్రతినిధులు పాల్గొన్నారు.
