- ఒత్తిడి చేసి తనతో సంతకాలు చేయించుకున్నరని ఆరోపణ
- పోలీసులకు ఏపీ వాసి ఫిర్యాదు
సైఫాబాద్, వెలుగు: ఈడీ అధికారులు విచారణ పేరుతో తనపై ఒత్తిడి చేసి, దాడి చేయడంతో పాటు బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంగళంపల్లి మణికంఠ గురువారం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న వల్లూ సందీప్‌తో తనకు వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని తెలిపారు. ఓ భూ వ్యవహారానికి సంబంధించి ఈడీ అధికారులు తనను విచారణకు పిలిచారని చెప్పారు.
ఈ క్రమంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్‌కు వ్యతిరేకంగా తనతో స్టేట్‌మెంట్ రికార్డు చేయించారని ఆరోపించారు. లిక్కర్ కేసులో నిందితులతో తనకు సంబంధాలు ఉన్నట్లు ముడిపెడుతున్నారని వాపోయారు. అయితే, మణికంఠ ఆరోపణలను ఈడీ అధికారులు ఖండించారు. విచారణ సమయంలో ఎలాంటి దాడి చేయలేదని, నిబంధనలకు లోబడే విచారణ చేపట్టామని తెలిపారు. నిందితులను కాపాడేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
