- ఆపత్కాలంలో ఆదుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
- డిప్యూటి సీఎం భట్టి సానుకూల స్పందన
- ఉత్తర, దక్షిణ డిస్కమ్‌ల నుంచి 2 వేల మంది కేటాయింపు
హైదరాబాద్, వెలుగు: అర్నాబ్తుపాను దెబ్బకు ఏపీలో అస్తవ్యస్తంగా మారిన విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు తెలంగాణ సాయం అందిస్తున్నది. ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. భట్టి ఆదేశాల మేరకు ఉత్తర, దక్షిణ డిస్కంల నుంచి 2వేల మంది సిబ్బందిని ఏపీలో విద్యుత్ పునరుద్ధరణ పనుల కోసం గురువారం పంపించారు.
ఉదయం చంద్రబాబు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఫోన్ చేశారు. తుఫాన్ ప్రభావం వల్ల ఏపీలోని అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని, సుమారు 16 వేలకు పైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని, వందల గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని వివరించారు.
ఈ ఆపత్కకాలంలో అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సైతం లేఖ రాశారు. స్పందించిన డిప్యూటీ సీఎం.. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన అనంతరం అవసరమైన సిబ్బందిని ఏపీకి పంపించాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, సదరన్, నార్తర్న్ డిస్కమ్‌ల సీఎండీలు జితేష్ వి. పాటిల్, వరుణ్ రెడ్డిని ఆదేశించారు.
దీంతో సదరన్ డిస్కమ్ పరిధి నుంచి 1,360 మందిని, నార్తర్న్ డిస్కమ్నుంచి 640 మందిని మొత్తంగా 2 వేల మంది విద్యుత్ సిబ్బందిని ఆంధ్రాకు తరలించారు. రెండు ఏరియాల నుంచి 20కి పైగా ఈఆర్టీ వెహికల్స్ వెంట తీసుకొని సుమారు 300 మంది సిబ్బంది గురువారమే ఏపీకి బయల్దేరి వెళ్లారు. మిగతా వాళ్లు శుక్రవారం ఏపీకి చేరుకుంటారని డిస్కమ్‌ల సీఎండీలు జితేష్ వి.పాటిల్, వరుణ్ రెడ్డి పేర్కొన్నారు.
