హాలీడే తీసుకున్నది కేసీఆరే .. కేటీఆర్ వ్యాఖ్యల్లో అహంకారం, అక్కసు

హాలీడే తీసుకున్నది కేసీఆరే .. కేటీఆర్ వ్యాఖ్యల్లో అహంకారం, అక్కసు
  • విప్ ఆది శ్రీనివాస్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి హాలీడే ఇవ్వాలని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యల్లో అహంకారం, అక్కసు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. అసలైన హాలీడే తీసుకుంది కేసీఆరేనని స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం సీఎల్పీలో ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. 

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన తగిన గౌరవం, మర్యాద ఇవ్వాలనే ఉద్దేశంతో తాము సంయమనంతో వ్యవహరిస్తున్నామని, దాన్ని అలుసుగా తీసుకుని ప్రభుత్వంపై అలాగే సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుపై కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

కరువు వంటి ప్రకృతి విపత్తులు సంభవించిన క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన ప్రతిపక్షం, దాన్ని వదిలేసి కేవలం రాజకీయ విమర్శలకే ప్రాధాన్యత ఇవ్వడం సరైంది కాదని హితవు పలికారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు, అసత్య ప్రచారాలకు తాము తగిన వాస్తవాలతోనే సమాధానం చెప్తామని కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు స్పష్టం చేశారు.