- రేవంత్ వెయ్యి టీఎంసీలు సముద్రంలోకి వదిలిండు
- ఏపీ, కర్ణాటకల్లోనూ కరువున్నా రైతులకు మేలైతుంది
- పంటలు ఎండిపోతుంటే.. రూ.లక్షన్నర కోట్లతో
- మూసీ సుందరీకరణ ఎందుకు చేస్తున్నట్టు?
- అది గ్లోబల్ సమ్మిట్ కాదు.. గోబెల్స్ సమ్మిట్: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: మన రాష్ట్రంతో పాటే ఏపీ, కర్ణాటకలోనూ వర్షాల లోటున్నా అక్కడ కరువు లేదని, తెలంగాణలోనే ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి టీఎంసీల గోదావరి నీళ్లను సముద్రంలోకి వదిలేసిందని చెప్పారు. కరువున్నప్పుడు నీళ్లు ఎత్తిపోయలేదని మండిపడ్డారు. ఈ విషయంలో చంద్రబాబు గ్రేట్ అని అన్నారు. అక్కడ కరువు ఛాయలు రాకుండా ఉండేందుకు ముందుగానే గోదావరి, కృష్ణా నదుల నుంచి నీటిని లిఫ్ట్ చేశారని అన్నారు.
గురువారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రైతుబంధు నిధులు పూర్తిస్థాయిలో అందక, రైతుబీమా ఆగిపోయి, పెన్షన్లు రాక జనం గోసపడుతున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ల పేరుతో గప్పాలు కొట్టిన కాంగ్రెస్.. తీరా గద్దెనెక్కాక పంటలు ఎండిపోతుంటే రైతుల నుంచే సెల్ఫ్ డిక్లరేషన్లు తీసుకునే పరిస్థితికి వచ్చిందన్నారు. సాగు, తాగునీరు అందక ప్రజలు, రైతులు అల్లాడుతుంటే.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కమీషన్ల కోసం రూ.లక్షన్నర కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్ జపం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాగడానికి నీళ్లు లేవంటూనే మూసీ సుందరీకరణలో 10 టీఎంసీల నీళ్లు ఇక్కడ ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు.
పవర్ హాలిడేస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు?
రాష్ట్రంలో నెలకొన్న దుస్థితి ప్రకృతి వైపరీత్యం కాదని, కాంగ్రెస్ అసమర్థ పాలన తెచ్చిన కరువేనని కేటీఆర్ స్పష్టం చేశారు. తమ హయాంలో పరిశ్రమలకు, వ్యవసాయానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించామని, కాంగ్రెస్ రాగానే మళ్లీ పరిశ్రమలకు ‘పవర్ హాలిడేస్’ ప్రకటించే దుస్థితి వచ్చిందని విమర్శించారు. కరెంటు, సాగునీళ్లు లేక రాష్ట్రం కరువుతో తల్లడిల్లుతుంటే కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఫ్లెక్సీలు, ప్రకటనల కోసం తగలేస్తూ ప్రభుత్వం గోబెల్స్ సమ్మిట్ నిర్వహిస్తోందని కేటీఆర్ విమర్శించారు.
పవర్ హాలిడేలు, నీటి కష్టాలు ఉన్న రాష్ట్రంలో ఏ పెట్టుబడిదారుడైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తాడా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఒక్క కొత్త పెట్టుబడి గానీ, కొత్త ఉద్యోగం గానీ రాలేదన్నారు. పైగా తాము దిగిపోయేనాటికి 9,46,000గా ఉన్న ఐటీ ఉద్యోగాలు.. కాంగ్రెస్ వచ్చాక దాదాపు 7,000 వరకు తగ్గాయని ప్రభుత్వమే స్వయంగా ఒప్పుకుందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి ప్రచార ఆర్భాటాలు, గ్లోబల్ సమ్మిట్లు లేకుండానే పదేళ్లలో రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నారు. కాంగ్రెస్ సర్కారు చేసిన విదేశీ పర్యటనలు ఎన్ని? కుదుర్చుకున్న ఒప్పందాలు (ఎంఓయూలు) ఎన్ని? రాష్ట్రానికి వచ్చిన వాస్తవ పెట్టుబడులెన్ని? కల్పించిన కొత్త ఉద్యోగాలెన్నో వివరాలతో వెంటనే వైట్ పేపర్ విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
