తెలంగాణ ఆర్థిక ప్రగతికి కేంద్రం మద్దతు.. రాష్ట్ర విజయగాథలో భాగస్వామిగా ఉంటాం: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ 

తెలంగాణ ఆర్థిక ప్రగతికి కేంద్రం మద్దతు.. రాష్ట్ర విజయగాథలో భాగస్వామిగా ఉంటాం: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ 
  • ఫార్మా, బయోటెక్ రంగాల్లో తెలంగాణ బలంగా ఉంది
  • ఏరోస్పేస్, డిఫెన్స్, క్వాంటం కంప్యూటింగ్‌‌‌‌పై దృష్టి సారించండి
  • 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే లక్ష్యాన్ని స్వాగతిస్తున్నామని వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణ ఆర్థిక ప్రగతికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. రాష్ట్ర విజయగాథలో భాగస్వామిగా ఉంటామని హామీ ఇచ్చారు. ఫార్మా, బయోటెక్ రంగాల్లో బలంగా ఉన్న తెలంగాణ.. ఏరోస్పేస్, డిఫెన్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి రంగాలపైనా దృష్టి సారించాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమ్మిట్‌‌‌‌ను మరో పండుగలా అభివర్ణించారు. భారత్ 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకోవాలంటే అన్ని రాష్ట్రాలు అన్ని రంగాల్లో రాణించాలని గోయల్ అన్నారు. తెలంగాణకు వచ్చే ప్రతి పెట్టుబడి, సృష్టించే ప్రతి ఉద్యోగం ఈ జాతీయ లక్ష్యానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యాన్ని స్వాగతించారు.700 ఏళ్ల క్రితమే కాకతీయ గణపతి చక్రవర్తి నౌకా వాణిజ్యంపై వేయించిన మోటుపల్లి శాసనాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. నాడు వ్యాపారులు కోరుకున్న పెట్టుబడుల భద్రత, విధాన నిర్ణయాల్లో స్థిరత్వం నేటి పారిశ్రామికవేత్తలకూ అవసరమని చెప్పారు.

మధ్య ఆసియా సంక్షోభం వంటి అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్నా అంచనాలను మించి భారత్ ఎగుమతులు పెరుగుతున్నాయని, దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందని వివరించారు. ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచిందన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), లైఫ్ సైన్సెస్ వంటి అత్యాధునిక రంగాల్లో హైదరాబాద్ ముందంజలో ఉందని గోయల్ తెలిపారు. జీఐ ట్యాగ్ పొందిన తాండూరు కందులు, నిజామాబాద్ పసుపు తెలంగాణ ప్రత్యేకతలని చెప్పారు. తాండూరు కందులను ఇప్పటికే ఆస్ట్రేలియాకు ఎగుమతి చేసినట్లు వెల్లడించారు.