న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబర్‌లో (హెచ్1) భారత ఫార్మాస్యూటికల్ ఎగుమతులు 4.9 శాతం పెరిగి సుమారు రూ.1.53లక్షల కోట్ల (16.13 బిలియన్ డాలర్ల)కు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో వీటి విలువ సుమారు రూ.1.46 లక్షల కోట్లు (15.38 బిలియన్ డాలర్లు)గా ఉంది. ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) రిపోర్ట్ ప్రకారం, ఐరోపా, ఆసియాన్, లాటిన్ అమెరికా దేశాల నుంచి వచ్చిన భారీ డిమాండ్ ఈ వృద్ధికి ప్రధాన కారణం.సెప్టెంబర్ క్వార్టర్‌లో ఎగుమతులు 3.05 శాతం పెరిగి సుమారు రూ.76 వేల కోట్లకు చేరాయి. ఒక్క సెప్టెంబర్‌లోనే అత్యధికంగా సుమారు రూ.25,650 కోట్ల ఎగుమతులు జరిగాయి.
యూరప్ టాప్
యూరప్‌కు ఎగుమతులు 9.6 శాతం వృద్ధితో సుమారు రూ.30,685 కోట్లకు ఎగబాకాయి. మొత్తం ఎగుమతుల్లో ఇది 20.38 శాతం కావడం విశేషం. ఆసియాన్‌కు 21.54 శాతం, లాటిన్ అమెరికాకు 16.58 శాతం ఎగుమతులు పెరిగాయి. ఉత్పత్తుల పరంగా డ్రగ్ ఫార్ములేషన్స్, బయోలాజికల్స్ విభాగం అత్యధికంగా 73.84 శాతం వాటా దక్కించుకుంది. నాణ్యమైన మందుల తయారీలో భారత్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందని ఫార్మెక్సిల్ చైర్మన్ నమిత్ జోషి తెలిపారు.
బల్క్ డ్రగ్స్ ఎగుమతుల్లో 12.07 శాతం వృద్ధి సాధించడం దేశీయ తయారీ సామర్థ్యాలకు నిదర్శనమని వైస్ చైర్మన్ భావిన్ మెహతా వివరించారు. ఎంఎస్‌ఎంఈ సంస్థలు సైతం అంతర్జాతీయ స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
