- పరువు హత్యలపై సతీశ్ చందర్ అస్త్రం
- ‘పరువు తండ్రి - ఎరువు భర్త’ నవల ఆవిష్కరణ
హైదరాబాద్, వెలుగు: పరువు హత్యలను వస్తువుగా తీసుకుని తాత్త్విక దృష్టితో రాసిన తొలి వ్యంగ్య నవలగా సతీష్ చందర్ ‘పరువుతండ్రి - ఎరువుభర్త’భారతీయ సాహిత్య చరిత్రలో నిలిచిపోతుందని పలువురు సాహితీవేత్తలు, ప్రొఫెసర్లు కొనియాడారు. తెలుగులో వ్యంగ్య రచనకు కేరాఫ్ గా సతీశ్ చందర్ నిలుస్తారని అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు నవలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ, కుల పీడనకు గురవుతున్న రెండు వర్గాల మధ్య ఆధిపత్య కులాలు ఎలా చిచ్చు పెడతాయో రచయిత కళ్లకు కట్టారని చెప్పారు. తాత్త్వికతతో పాటు హింసను, విషాద పాత్రలను బలంగా చిత్రించారని అన్నారు.సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ, నేటి సమాజంలోనూ కులం ఎంత బలంగా వేళ్లూనుకుని ఉందో పాత్రల ద్వారా నవల చెబుతుందన్నారు.
కొడుకును ఆస్తికి, కూతుర్ని పరువుకు వారసులుగా చూసే ధోరణిలోని అన్యాయాన్ని రచయిత ఎండగట్టారని పేర్కొన్నారు. చదువుతుంటే సినిమా చూస్తున్నట్లు దృశ్యకావ్యంగా నవల సాగుతుందని తెలిపారు. ప్రధాన వక్త, ప్రముఖ రచయిత్రి కుప్పిల పద్మ మాట్లాడుతూ, కులం పేరుతో స్త్రీ స్వేచ్ఛను కాలరాయడం దారుణమన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక మాజీ సంపాదకులు రాఘవరావు, ఏపీ కాలేజీ ఆఫ్ జర్నలిజం కరస్పాండెంట్ గౌరీచందర్, స్రవంత్ పాల్గొన్నారు.
