- మున్నూరు కాపుల ఆత్మగౌరవ భవనం నిర్మాణం వేగంగా పూర్తి చేయాలి
హైదరాబాద్, వెలుగు: బీసీలంతా ఐక్యంగా ఉండాలని, రాజకీయ చైతన్యం మరింత పెరగాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఉన్నత స్ధాయిలో ఉన్న పెద్దలు కుల అభివృధ్దికి పాటుపడాలన్నారు. మున్నూరు కాపుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ఇటీవల రాష్ర్ట ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది.
ఈ సందర్భంగా గురువారం రాష్ర్ట ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం మాట్లాడారు.. మున్నూరు కాపు ఆత్మ గౌరవ భవనాన్ని త్వరగా స్టార్ట్ చేసి పూర్తి చేయాలని, అదనపు నిధులు అవసరమైతే ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు.
వేములవాడ వెళ్ళినప్పుడు మున్నూరు కాపు సత్రంలోనే ఉండేవారమని గుర్తు చేశారు. దాతల సహాయంతో 40 ఏసీ రూమ్ లతో వేములవాడలో గౌడ సత్రం నిర్మించామని, ఇప్పుడు భక్తులందరికి చాలా బాగా ఉపయోగపడుతుందన్నారు. మున్నూరు కాపు కార్పొరేషన్ ద్వారా యువతకు స్వయం ఉపాధి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటామని వెల్లడించారు.
'త్వరలో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభం కాబోతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కుల వృత్తులు మారాలి. కుల గణన చేశాం. ఉన్నత చదువులు చదివిన కుటుంబాలే ఆర్థికంగా మంచి స్థానంలో ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. మీ పిల్లలకు శిక్షణ ఇప్పించండి. భవిష్యత్ పెట్టుబడి విద్య మాత్రమే. అది ప్రభుత్వం అందిస్తుంది' అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విప్ ఆది శ్రీనివాస్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గద్వాల విజయ లక్ష్మీ, ఎమ్మెల్సీ దండే విఠల్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
