డ్రమ్ముల్లో కోట్ల కొద్దీ డబ్బు!.. యూపీలో ఇంట్లో 15అడుగుల గోతిలో మూడు డ్రమ్ములు

డ్రమ్ముల్లో కోట్ల కొద్దీ డబ్బు!..  యూపీలో ఇంట్లో 15అడుగుల గోతిలో మూడు  డ్రమ్ములు
  • రూ.5 కోట్ల నుంచి10 కోట్ల వరకు నగదు ఉన్నట్లు పోలీసుల అంచనా 

లక్నో: ఉత్తరప్రదేశ్‌‌‌‌లో భారీగా నల్లధనం బయటపడింది. ప్రయాగ్‌‌‌‌రాజ్‌‌‌‌ లోని ఓ ఇంట్లో 15 అడుగుల లోతున పాతిపెట్టిన మూడు డ్రమ్ముల్లో  రూ.500 నోట్ల కట్టలు బయటపడ్డాయి. వీటి విలువ రూ.5 కోట్ల నుంచి10 కోట్ల వరకు ఉండొచ్చని పోలీసులు అంచనా. రామ్‌‌‌‌నగర్‌‌‌‌ (బరాయ్‌‌‌‌పూర్‌‌‌‌) గ్రామానికి చెందిన రాకేశ్‌‌‌‌ యాదవ్‌‌‌‌, రాజేశ్‌‌‌‌ యాదవ్‌‌‌‌ అన్నదమ్ముల ఇంట్లో భారీగా నగదు ఉందనే సమాచారంతో పోలీసులు సోదాలు చేశారు. ఓ గదిలో15 అడుగుల వరకు తవ్వి చూడగా మూడు డ్రమ్ముల్లో నల్లటి ప్లాస్టిక్‌‌‌‌ కవర్లు, బట్టల్లో చుట్టిన రూ.500 నోట్ల కట్టలు బయటపడ్డాయి. 

రాకేశ్‌‌‌‌ యాదవ్‌‌‌‌ గతంలో పుణెలోని ఓ నగల దుకాణంలో సాధారణ ఉద్యోగిగా పనిచేసేవాడు. 2020లో కరోనా లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ సమయంలో సొంతూరికి వచ్చాడు. ఆ తర్వాత తక్కువ కాలంలోనే భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. 22 ఎకరాల భూమి కొనడంతో పాటు, రూ.కోటి ఖర్చుతో ఇల్లు కట్టాడు.ఇటీవల పొరుగువారితో రాకేశ్‌‌‌‌కు గొడవ జరగడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులతోనూ అతడు వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. 

దీంతో స్థానికులు ఇంట్లో నగదు దాచిన విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమాచారంతో తనిఖీలు చేపట్టగా కోట్ల నగదు బయటపడింది. ఈ కేసులో రాకేశ్‌‌‌‌ సోదరుడు బాబ్లూతో పాటు కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.