పది రోజుల్లో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలి.. హౌసింగ్‌‌‌‌ బోర్డుకు హైకోర్టు ఆదేశం

పది రోజుల్లో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలి.. హౌసింగ్‌‌‌‌ బోర్డుకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కొనుగోలుదారులకు హైకోర్టులో ఊరట లభించింది. బకాయిలపై వడ్డీ చెల్లించలేదన్న కారణంతో రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంపై తెలంగాణ హౌసింగ్‌‌‌‌ బోర్డు తీరును ధర్మాసనం తప్పుబట్టింది. హౌసింగ్‌‌‌‌ బోర్డు ప్రభుత్వ సంస్థా? ప్రైవేటు సంస్థా? అని ప్రశ్నించింది. వ్యాపార ధోరణితో వ్యవహరించడం ఏంటని నిలదీసింది.

ఫ్లాట్లను హౌసింగ్‌‌‌‌ బోర్డు సొంత నిధులతో కాకుండా ప్రజాధనంతో నిర్మించిందని గుర్తుచేసింది. బకాయిలు, జరిమానాలు, ఇతర సర్దుబాట్లతో సంబంధం లేకుండా 107 మందికిపైగా కొనుగోలుదారుల ఫ్లాట్లను పది రోజుల్లో రిజిస్ట్రేషన్‌‌‌‌ చేయాలని ఆదేశించింది. ఈ రిజిస్ట్రేషన్లు పూర్తిచేస్తే కొనుగోలుదారులకు ఆరు శాతం వడ్డీ చెల్లించాలంటూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌‌‌‌ (ఎన్‌‌‌‌సీడీఆర్‌‌‌‌సీ) ఇచ్చిన ఉత్తర్వుల అమలు రద్దవుతుందని తెలిపింది. సర్దుబాట్లు, జరిమానాలపై తదుపరి విచారణలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొంటూ కేసును నవంబర్ 18కి వాయిదా వేసింది.

ఫ్లాట్లను అప్పగించాల్సిన గడువు 2013 నుంచి వాటిని కొనుగోలుదారులకు అప్పగించే వరకు ఏడాదికి ఆరు శాతం చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఎన్‌‌‌‌సీడీఆర్‌‌‌‌సీ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హౌసింగ్‌‌‌‌ బోర్డు హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేసింది. జస్టిస్‌‌‌‌ బి. విజయసేన్‌‌‌‌రెడ్డి, జస్టిస్‌‌‌‌ గాడి ప్రవీణ్‌‌‌‌కుమార్‌‌‌‌తో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. ఒక్కో కొనుగోలుదారు రూ.47,85,000 చెల్లిస్తే ఫ్లాట్లను రిజిస్ట్రేషన్‌‌‌‌ చేస్తామని హౌసింగ్‌‌‌‌ బోర్డు తరపు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది తెలిపారు.

ఒప్పందంలోని 13వ క్లాజు ప్రకారం కొనుగోలుదారులకు చెల్లించాల్సిన ఆరు శాతం వడ్డీ రూ.16,66,946ను తుది అమ్మకపు ధరలో సర్దుబాటు చేయాలని వారి తరపు న్యాయవాది కోరారు. ఆ మొత్తం సర్దుబాటు చేసినా హౌసింగ్‌‌‌‌ బోర్డు నుంచి కొనుగోలుదారులకు రూ.4.61 లక్షలు రావాల్సి ఉంటుందని వివరించారు. రిజిస్ట్రేషన్లు చేసి ఇస్తామని ఎన్‌‌‌‌సీడీఆర్‌‌‌‌సీ ఎదుట హౌసింగ్‌‌‌‌ బోర్డు హామీ ఇచ్చిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. బకాయిలు, వడ్డీ, జరిమానాల అంశాలను రిజిస్ట్రేషన్లకు ముడిపెట్టరాదని స్పష్టం చేసింది.