- ఆయనను బంగ్లా పీఠంపై కూర్చోబెట్టింది జర్నలిస్టే
- యూనస్ మాజీ ప్రెస్ సెక్రటరీ ఆలం
ఢాకా: బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వ పతనానికి సంబంధించిన నిజాలు ఒక్కటొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానిగా ఉన్న షేక్ హసీనా పదవి నుంచి దిగిపోవడానికి రెండు రోజుల ముందే.. తాత్కాలిక ప్రభుత్వ బాధ్యతలు చేపట్టేందుకు ముహమ్మద్ యూనస్ పేరు ఖరారైందని యూనస్ మాజీ ప్రెస్ సెక్రటరీ షఫీఫుల్ ఆలం బుధవారం తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.
హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం పూర్తిగా సహజంగా జరిగిన ఉద్యమం కాదని.. ఆమెను గద్దె దించేందుకు ఓ ప్లాన్ ప్రాకారమే రెజిమ్ -చేంజ్ ఆపరేషన్(పాలనా మార్పు)కు పాల్పడ్డారని తెలిపారు. విద్యార్థి నాయకులకు, ముహమ్మద్ యూనస్‌కు మధ్య ప్రముఖ ఫ్రెంచ్ వార్తా సంస్థ 'ఏజెన్స్ ఫ్రాన్స్-ప్రెస్( ఏఎఫ్‌పీ)'లో పనిచేస్తున్న ఓ జర్నలిస్ట్ మీడియేటర్ లా వ్యవహరించారని వివరించారు.
ఏఎఫ్‌పీ ఫ్యాక్ట్-చెక్ విభాగంలో పనిచేస్తున్న ఖదరుద్దీన్ శిశిర్ అనే ఎడిటర్ ఈ ప్రమాదకర ఆపరేషన్‌ను రహస్యంగా పూర్తిచేశారన్నారు. పారిస్‌లో ఉన్న ముహమ్మద్ యూనస్‌ను కలిసి దేశాన్ని నడిపించడానికి ఆయనను శిశిర్ ఒప్పించాడని వెల్లడించారు. ఒకవేళ ఈ కుట్ర ముందే తెలిసి ఉంటే ఆ జర్నలిస్ట్ బృందమంతా హసీనా పాలనలో కటకటాల పాలయ్యేదని ఆలం పేర్కొన్నారు.
