- స్పెయిన్ లో వేలాది మంది వీధుల్లోకి వచ్చి ఆందోళన
- భద్రతా సిబ్బందిపైకి బాటిళ్లు విసిరిన నిరసనకారులు
మాడ్రిడ్: స్పెయిన్లో హైస్పీడ్ రైలు ప్రమాద ఘటనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. వేలాది మంది వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. ప్రధాని పెడ్రో సాంచెజ్, రవాణా మంత్రి ఆస్కార్ పుయెంటే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజధానిలోని స్పానిష్ రవాణా మంత్రిత్వ శాఖ భవనం వెలుపల రాత్రికి రాత్రే దాదాపు 1,500 మంది గుమిగూడి మంత్రులు రాజీనామా చేయాలని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కొందరు నిరసనకారులు భద్రతా సిబ్బందిపైకి బాటిళ్లు విసిరారు. దీంతో పోలీసులు గుంపును చెదరగొట్టేందుకు బాష్పవాయువు ప్రయోగించారు. 'క్రిమినల్స్.. 78 నాటి పాలనా వ్యవస్థను అంతం చేయాలి' అని రాసి ఉన్న బ్యానర్లను ఆందోళనకారులు ప్రదర్శించారు. ఆస్కార్ పుయెంటే.. మృత్యు మంత్రి అంటూ నినాదాలు హోరెత్తించారు. రైల్వే భద్రతకు రక్షణ కల్పిస్తూ రైల్వే డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో ఇవాళ సమ్మెకు కూడా పిలుపునిచ్చినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది.
తాజా ఘటనతో ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం సడలిపోయింది. ప్రధాని పెడ్రో సాంచెజ్ ప్రమాద స్థలాన్ని సందర్శించి, బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నేపథ్యంలో స్పెయిన్ ప్రభుత్వం గురువారం నుంచి 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది.
