యూరప్‌‌‌‌‌‌‌‌లో యుద్ధ భయం! ..ఇంట్లో 72 గంటల సరుకులు రెడీగా పెట్టుకోండి

యూరప్‌‌‌‌‌‌‌‌లో యుద్ధ భయం! ..ఇంట్లో 72 గంటల సరుకులు రెడీగా పెట్టుకోండి

 

  • జపాన్​లో వారం రోజులు.. ఆస్ట్రియాలో రెండు వారాలు
  • టార్చిలైట్లు, రేడియోలు, పవర్ బ్యాంకుల కోసం ఎగబడుతున్న జనం
  • ఇరాన్​లో మందుల కొరత.. బ్రిటన్ లో బీ రెడీ క్యాంపెయిన్
  • ఇది యుద్ధ సంకేతం కాదు.. ముందు జాగ్రత్తే: ప్రభుత్వాలు


 
న్యూఢిల్లీ:  నీళ్లు, డబ్బాల్లో ఫుడ్, టార్చిలైట్, చేతిలో కొంత క్యాష్.. ఇన్నాళ్లూ కొందరి హాబీగా కనిపించిన ఈ ముందు జాగ్రత్త చర్యలు ఇప్పుడు ప్రభుత్వాల అధికారిక సలహాలయ్యాయి. యుద్ధాలు, సైబర్ దాడులు, ప్రకృతి విపత్తుల ముప్పుతో యూరప్ దేశాలు అలర్టయ్యాయి. అమెరికా, జపాన్ కూడా అదే బాటలో నడుస్తున్నాయి. ఏ ఆపద వచ్చినా కనీసం మూడు రోజులు (72 గంటలు) కుటుంబం గడిచేలా ఆహారం, తాగునీరు, మందులు వంటి నిత్యావసరాలను ఇంట్లో సిద్ధంగా పెట్టుకోవాలని ఈ దేశాల ప్రభుత్వాలు పౌరులకు సూచిస్తున్నాయి. బయటి సాయం లేకుండా 90 రోజులు నడిచేలా అమెరికా తన సైనిక స్థావరాల కోసం ‘ఫోర్ట్రెస్’ప్లాన్ రెడీ చేస్తున్నట్లు సమాచారం.

బ్రిటన్ లో ‘బీ రెడీ’ క్యాంపెయిన్

బ్రిటన్ ప్రభుత్వం అక్టోబర్ 22న ‘బీ రెడీ’క్యాంపెయిన్ మొదలుపెట్టింది. ఇది మూడేండ్ల పాటు సాగనుంది. కరెంట్, నీళ్లు, ఫోన్, ఇంటర్నెట్ లేకున్నా మూడు రోజులు గడిచేలా ఇండ్లల్లో ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. బాటిల్ నీళ్లు, పాడవని ఆహారం, టార్చిలైట్, బ్యాటరీలు, రేడియో, శానిటైజర్, మందులు, క్యాష్ అందుబాటులో ఉంచుకోవాలని చెప్పింది. గతేడాది చలికాలం తుఫాన్లు, ఈ వేసవిలో కార్చిచ్చుల వల్ల ఫోన్ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లు, కరెంట్, నీటి సరఫరా నిలిచిపోయిన విషయాన్ని గుర్తుచేసింది. శత్రు దేశాలు, ఉగ్రవాదుల వల్ల సరఫరా వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ కూడా మూడు రోజుల సన్నద్ధతనే సూచించాయి. 

టార్చి లైట్లు, రేడియోలు తెగ కొంటున్రు

ప్రభుత్వ సూచనలతో బ్రిటన్‌‌‌‌లో టార్చిలైట్లు, పవర్ బ్యాంకులు, రేడియోలు, వాటర్ బాటిళ్లు, డబ్బాల్లో నిల్వ ఉండే ఫుడ్ కొనుగోళ్లు భారీగా పెరిగాయి. మ్యాప్లిన్ సంస్థలో టార్చిలైట్ల అమ్మకాలు దాదాపు నాలుగు రెట్లు పెరగగా, పవర్ బ్యాంకులు, రేడియోల సేల్స్ రెట్టింపయ్యాయి. ఐస్‌‌‌‌లాండ్ సూపర్ మార్కెట్‌‌‌‌లో వీకెండ్‌‌‌‌లో ప్యాకేజ్డ్ ఫుడ్ అమ్మకాలు 40 శాతం ఎగబాకాయి. రేడియోలు, నీటిని శుద్ధి చేసే ట్యాబ్లెట్లు స్టాక్ అయిపోయాయి.

వారం సామాన్ రెడీ పెట్టుకోవాలన్న జపాన్

జపాన్ కొత్తగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థను ప్రారంభిస్తోంది. ఈ సందర్భంగా ఆహారం, నీళ్లు, శానిటేషన్ సామగ్రి నిల్వ చేసుకోవాలని మంత్రిత్వ శాఖలు, ప్రిఫెక్చర్లు, పౌరులకు విజ్ఞప్తి చేయనుంది. కనీసం మూడు రోజులు, వీలైతే వారానికి సరిపడా సరుకులు ఉంచుకోవాలని విపత్తు నిర్వహణ మంత్రి గోషి హోసోనో చెప్పారు. పసిఫిక్ తీరంలోని నంకాయ్ ట్రఫ్ వెంట భారీ భూకంపం, టోక్యో కింద భూకంపం, ఫ్యూజీ అగ్నిపర్వతం బద్దలయ్యే ముప్పుపై సంస్థ దృష్టి పెట్టనుంది. రాబోయే 30 ఏండ్లలో నంకాయ్ ట్రఫ్‌‌‌‌లో మహా భూకంపం వచ్చే అవకాశం 60 నుంచి 90 శాతానికి పైగా ఉందని జపాన్ అధికారులు అంచనా వేస్తున్నారు.

రష్యా భయంతో బంకర్లు రెడీ

ఉక్రెయిన్‌‌‌‌పై రష్యా దాడి తర్వాత ఫిన్లాండ్, స్వీడన్, పోలండ్, ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియా దేశాలు పౌర రక్షణను పటిష్టం చేసుకుంటున్నాయి. బంకర్ల పునరుద్ధరణ, తరలింపు ప్లాన్లు, ప్రజలకు శిక్షణ వంటి చర్యలు చేపట్టాయి. ‘సంక్షోభం లేదా యుద్ధం వస్తే’పేరుతో 32 పేజీల బుక్‌‌‌‌లెట్‌‌‌‌ను స్వీడన్ 2024లోనే ప్రతి ఇంటికీ పంపింది. దాడి జరిగితే దేశం ఎప్పటికీ లొంగిపోదని మొదటి పేజీలోనే రాసింది.

ఫిన్లాండ్ తొమ్మిది నెలలకు సరిపడా ధాన్యం నిల్వలు పెంచుకోగా, నార్వే స్వయం సమృద్ధి గడువును మూడు రోజుల నుంచి వారానికి పెంచింది. 72 గంటల నిల్వ ఉంచుకోవాలని యూరోపియన్ కమిషన్ గతేడాది నుంచే ఈయూ పౌరులకు చెబుతోంది. ఆస్ట్రియా అయితే 10 నుంచి 14 రోజులకు సరిపడా ఆహారం, నీళ్లు ఉంచుకోవాలని సూచిస్తోంది. బాల్టిక్ సముద్రంలో డేటా కేబుళ్ల విధ్వంసం అనుమానాలు ఉత్తర యూరప్ ఆందోళనకు కారణమవుతున్నాయి.

ఇరాన్‌‌‌‌లో మందుల కొరత

అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ ప్రజలు ఆహారం, మందులను ముందుగానే కొని పెట్టుకుంటున్నారు. బియ్యం, పిండి, పప్పులు, వంటనూనె, డబ్బాల్లోని ఫుడ్ నిల్వ చేసుకుంటున్నారు. దిగుమతి చేసుకునే మందులు, శిశువుల పాల పొడికి కొరత ఏర్పడుతోందని ఫార్మసీ సిబ్బంది చెబుతున్నారు. రవాణా మార్గాల్లో అడ్డంకులతో రైతుల ఎగుమతులు దెబ్బతింటున్నాయి. రియాల్ విలువ పడిపోవడంతో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. అమెరికా దిగ్బంధనాన్ని బలవంతంగానైనా తొలగించాలనే వాదనలూ అక్కడ వినిపిస్తున్నాయి. 

ముప్పేమిటో చెప్పకుండానే..!

ఏ ప్రభుత్వమూ నిర్దిష్ట ముప్పు ఏంటో చెప్పలేదు. కరెంట్ కోతలు, సైబర్ దాడులు, తుఫాన్లు, వరదలు, కార్చిచ్చుల వల్ల అత్యవసర సేవలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. అలాంటి టైమ్‌‌‌‌లో ప్రజలు తమ అవసరాలను సొంతంగా తీర్చుకుంటే, సహాయక బృందాలు ఎక్కువ అవసరమున్న వారిపై దృష్టి పెట్టగలుగుతాయని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇవి మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతాలు కావని, సంక్షోభం ఎదురైతే దాని ప్రభావాన్ని తగ్గించేందుకు చేసే ముందస్తు ఏర్పాట్లు మాత్రమేనని స్పష్టం చేస్తున్నాయి.