మహిళల భద్రత ప్రతిఒక్కరి బాధ్యత : విమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారుసిన్హా

మహిళల భద్రత ప్రతిఒక్కరి బాధ్యత : విమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారుసిన్హా

హైదరాబాద్, వెలుగు: మహిళల భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతిఒక్కరిదని మహిళా భద్రతా విభాగం డీజీ చారుసిన్హా అన్నారు. వేధింపులు, వివక్ష వంటి అనుచిత ప్రవర్తనను గుర్తించి ప్రశ్నించే ధైర్యాన్ని యువత అలవరుచుకోవాలని సూచించారు. తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో గురువారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘స్టాండ్‌‌‌‌ విత్‌‌‌‌ హర్‌‌‌‌’ ప్రచార కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ఓయూ వీసీ ఆచార్య డాక్టర్‌‌‌‌ కుమార్‌‌‌‌ మొలుగారం, మహిళా భద్రతా విభాగం శిక్షణ, కంటెంట్‌‌‌‌ అభివృద్ధి విభాగం అధిపతి ఆసియా షెర్వాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా చారుసిన్హా మాట్లాడుతూ మహిళల భద్రతకు చట్టాల అమలు ఒక్కటే సరిపోదని, ప్రజల ఆలోచనా విధానం, సామాజిక దృక్పథం, రోజువారీ ప్రవర్తనలోనూ మార్పు రావాలన్నారు.

ఓయూ వీసీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. విశ్వవిద్యాలయంలో సుమారు 40 శాతం మంది అధ్యాపకులు మహిళలే ఉన్నారని తెలిపారు. 1,500 మంది విద్యార్థినులు నివసించేలా ప్రత్యేక బహుళ అంతస్తుల వసతి గృహాల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.