కరుగుతున్న కంప్యూటర్ క్రేజ్..మూడేండ్లలో 97 నుంచి 82 శాతానికి పడిపోయిన ఐటీ అడ్మిషన్లు 

కరుగుతున్న కంప్యూటర్ క్రేజ్..మూడేండ్లలో 97 నుంచి 82 శాతానికి పడిపోయిన ఐటీ అడ్మిషన్లు 
  • ఒక్క సీఎస్‌‌‌‌ఈ కోర్‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌లోనే 5 వేల సీట్లు మిగులు
  • స్పెషలైజేషన్లూ వెలవెల.. 
  • పలు కోర్సుల్లో తగ్గిన చేరికలు 
  • బీటెక్ అడ్మిషన్లు సైతం 91 శాతం నుంచి 79 శాతానికి పతనం 
  • పుంజుకుంటున్న కోర్ గ్రూపులు.. సివిల్, మెకానికల్ వైపు చూపు

హైదరాబాద్, వెలుగు:  నిన్న, మొన్నటి వరకు ఇంజినీరింగ్ అంటేనే ‘కంప్యూటర్ సైన్స్’ అన్నట్లుగా ఎగబడిన విద్యార్థుల ఆలోచన ధోరణి మారుతున్నది.  అంతర్జాతీయంగా ఐటీ రంగంలో నెలకొన్న తీవ్ర అనిశ్చితి, కంపెనీల్లో ఉద్యోగాల కోతలు, లే-ఆఫ్స్ ప్రభావం   ఇంజినీరింగ్ అడ్మిషన్లపై నేరుగా పడుతున్నది. మూడేండ్ల ఎప్​ సెట్ కన్వీనర్ కోటా అడ్మిషన్ల లెక్కలను పరిశీలిస్తే ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తున్నది. 2024లో కంప్యూటర్ గ్రూపుల్లో ఏకంగా 97 శాతం సీట్లు భర్తీ కాగా, 2026 నాటికి ఆ ప్రవేశాలు 82 శాతానికి పడిపోయాయి. 

ఒక్క సీఎస్‌‌‌‌ఈలోనే 5 వేల సీట్లు ఖాళీ..

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్​ఈ) కోర్ బ్రాంచ్‌‌‌‌లో ఈసారి భారీగా సీట్లు మిగిలిపోయాయి . 2024 విద్యాసంవత్సరంలో అందుబాటులో ఉన్న 29,598 సీఎస్‌‌‌‌ఈ  సీట్లలో 28,865 (98%) మంది చేరారు. 2026 నాటికి సీట్ల సంఖ్య 30,792కి పెరిగినప్పటికీ.. చేరిన విద్యార్థుల సంఖ్య మాత్రం 25,785కే పరిమితమైంది. దీంతో చేరికల శాతం 84 శాతానికి పడిపోగా, ఒక్క కోర్ సీఎస్‌‌‌‌ఈలోనే 5,007 సీట్లు మిగిలిపోయాయి.  2024లో 59,546 మంది చేరగా, ఈ ఏడాది 54,625కు పడిపోయింది. ప్రస్తుతం ఈ గ్రూపులన్నింటిలో 11,747 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 

స్పెషలైజేషన్లదీ అదే దుస్థితి.. 

ఒకప్పుడు భారీ డిమాండ్ ఉన్న కంప్యూటర్ అనుబంధ స్పెషలైజేషన్ కోర్సుల్లో ప్రవేశాలు దారుణంగా పడిపోయాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సీఎస్ఐ) లో 2024లో 84 శాతం అడ్మిషన్లు నమోదు కాగా, 2026 నాటికి అది ఏకంగా 19 శాతానికి పడిపోయింది. అందుబాటులోని 410 సీట్లలో కేవలం 78 మంది మాత్రమే చేరడం గమనార్హం. అలాగే కంప్యూటర్ ఇంజినీరింగ్, సాఫ్ట్‌‌‌‌వేర్ ఇంజినీరింగ్ లో చేరికలు 89% నుంచి 30 శాతానికి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (సీఎస్​ఓ) లో 97% నుంచి 54 శాతానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ లో 94% నుంచి 72 శాతానికి, డేటా సైన్స్ (సీఎస్​డీ) లో 95% నుంచి 78 శాతానికి పడిపోయాయి. 

కోర్.. సివిల్, మెకానికల్ బాట 

సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ పుంజుకోవడం ఊరటనిస్తోంది. సివిల్, మెకానికల్ అండ్ అలైడ్ గ్రూపుల్లో మూడేండ్లలో ప్రవేశాలు క్రమంగా పెరుగుతున్నాయి. 2024లో ఈ గ్రూపుల్లోని 7,412 సీట్లలో 4,571 (62%) మంది చేరగా.. 2025లో 4,783 (63%) మంది, 2026 నాటికి 7,826 సీట్లలో ఏకంగా 5,125 (65%) మంది అడ్మిషన్లు పొందారు.  ప్రత్యేకించి మెకానికల్ ఇంజినీరింగ్‌‌‌‌లో చేరికలు 1,856 నుంచి 2,118కి (55% నుంచి 60%), సివిల్ ఇంజినీరింగ్‌‌‌‌లో 2,372 నుంచి 2,632కి (66% నుంచి 68%) పెరిగాయి. ప్రభుత్వ రంగంలో అవకాశాలు ఎక్కువగా ఉండే కోర్ ఇంజినీరింగ్ వైపు దృష్టి పెట్టడమే మేలని విద్యార్థులు, తల్లిదండ్రులు భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

19 వేలకుపైగా సీట్లు మిగులు.. 

కంప్యూటర్ బ్రాంచీల జోరు తగ్గడంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఇంజినీరింగ్ ప్రవేశాలపైనా తీవ్ర ప్రభావం పడింది. గత మూడేండ్లలో మొత్తం బీటెక్ సీట్ల భర్తీ 91 శాతం నుంచి 79 శాతానికి దిగజారింది. 2024లో కన్వీనర్ కోటాలో 87,184 సీట్లకు గాను 79,224 (91%) మంది, 2025లో 91,909 సీట్లకు 79,288 (86%) మంది చేరారు. అయితే, 2026లో మాత్రం సీట్ల సంఖ్య 94,251కి పెరిగినా చేరిన వారి సంఖ్య మాత్రం 74,510కి తగ్గిపోయింది. ఫలితంగా ఈ ఏడాది రాష్ట్రంలో ఏకంగా 19,741 ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోయాయి.