- ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లికి చెందిన నలుగురు అరెస్ట్
- రాజకీయ, ఆర్థిక విభేదాలే కారణమని ఖమ్మం సీపీ సునీల్ దత్ వెల్లడి
ఖమ్మం/ ఖమ్మం టౌన్, వెలుగు : సీపీఎం నేత సామినేని రామారావు హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. హత్యలో పాల్గొన్న నలుగురు నిందితులను గురువారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. రాజకీయ, ఆర్థిక విభేదాలే ఈ హత్యకు కారణమని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. గురువారం వైరా ఏసీపీ సారంగపాణితో కలిసి ఆయన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. గతేడాది అక్టోబర్ 31న పాతర్లపాడులోని ఇంటిలోనే సామినేని రామారావు హత్య జరిగింది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు ఆరు ప్రత్యేక పోలీసు బృందాలతో ముమ్మర దర్యాప్తు చేసినా, ఆధారాలు లేకపోవడం సవాల్ గా మారింది. ఘటనా స్థలంలో ఒక జత చెప్పులు, టీ షర్ట్ ముక్క సేకరించిన పోలీసులు వాటి ఆధారంగా దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలు, భౌతిక ఆధారాలు, ఫోరెన్సిక్ విశ్లేషణతో దర్యాప్తు జరిగింది. టాస్క్‌ఫోర్స్, సీసీఎస్, స్థానిక పోలీసుల సమన్వయంతో విచరణ కొనసాగింది.
అయినా ఎలాంటి పురోగతి లేకపోవడంతో పోలీసులు పాలిగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్ష కోసం 24 మందిను ఎంపిక చేశారు. ఆరుగురు మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. చివరకు తెల్దార్ పల్లికి చెందిన నలుగురిని అరెస్ట్ చేశారు. బోడపట్ల శ్రీనివాస్ అలియాస్ మెంటల్ శ్రీను, నూకల లింగయ్య, మల్లారపు లక్ష్మయ్య, కర్లపూడి ఉదయ్‌కుమార్ అలియాస్ రుక్మన్ లను నిందితులుగా తేల్చారు. నిందితుల నుంచి రెండు కత్తులు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ వైరా సారంగపాణి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరగ్గా, వైరా, చింతకాని, కొణిజర్ల, మధిర పోలీసు అధికారుల సమన్వయంతో దర్యాప్తు సాగింది. హత్య కేసును ఛేదించిన పోలీసు బృందాలను సీపీ సునీల్ దత్ అభినందించారు. నిందితులు గతంలో హత్య, హత్యాయత్నం కేసుల్లో నిందితులుగా ఉన్నారని తెలిపారు. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, ఆతర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
అసలైన హంతకులను పోలీసులు కాపాడుతున్నారు
- సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
సీపీఎం నేత సామినేని రామారావు హత్య కేసులో పోలీసులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సంబంధం లేని నలుగురిని పట్టుకొచ్చి, అసలైన హంతకులను తప్పించారని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు గురువారం ఓ ప్రకటనలో ఆరోపించారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన సాక్షులు, రామారావు భార్య స్వయంగా కొన్ని పేర్లు చెప్పినప్పటికీ వారిని విచారించకుండా వదిలేశారని పేర్కొన్నారు. అసలైన హంతకులను రక్షించేందుకే ఈ విధమైన అభూత కల్పనలతో కూడిన క్రైమ్స్టోరీని పోలీసులు రచించారని, పోలీసుల తీరుపై తమకు ఎలాంటి నమ్మకం లేదని, అందుకే సిట్చేత దర్యాప్తు జరిపించి న్యాయం చేయాలని సీపీఎం తరఫున ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. సిట్దర్యాప్తు జరిపిస్తానని చెప్పిన సీఎం ఆ తర్వాత మాట తప్పారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సిట్చేత ఈ హత్య కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
