- నవంబర్15 నుంచి రాతి కట్టడాల పనులు ప్రారంభం
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
బూర్గంపహాడ్/భద్రాచలం, వెలుగు : గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంతో పాటు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గురువారం భద్రాచలం సీతారామచంద్రస్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఆలయం చుట్టూ జరుగుతున్న పునరుద్ధరణ, అభివృద్ధి పనులను ఎమ్మెల్యేలు డాక్టర్ తెల్లం వెంకటరావు, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్‌రాజు, ఐటీడీఏ పీవో రాహుల్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులను నిర్దేశిత గడువు కంటే సుమారు పది రోజుల ముందుగానే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
నవంబర్15 నుంచి రాతి కట్టడాల పనులు ప్రారంభిస్తామని తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకు ప్రధాన ఆలయాలను అనుసంధానిస్తూ ప్రత్యేక ఆలయ పర్యాటక మార్గాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, గోదావరి పుష్కరాల నాటికి మార్గంలోని ఆలయాలనూ అభివృద్ధి చేస్తామని చెప్పారు. పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు భద్రాచలానికి వచ్చే అవకాశం ఉన్నందున పుష్కర ఘాట్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామన్నారు. భద్రాచలం పట్టణంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా సులభంగా బయటకు వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని, అందుకు సంబంధించిన అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో దామోదర్ రావు, ఆర్ అండ్‌బీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
