తీవ్ర సంక్షోభంలో వ్యవసాయ రంగం ..కౌలు రైతులకు రుణాలు, పరిహారం ఇవ్వాలని డిమాండ్

తీవ్ర సంక్షోభంలో వ్యవసాయ రంగం ..కౌలు రైతులకు రుణాలు, పరిహారం ఇవ్వాలని డిమాండ్
  •     ఏఐకేఎస్ జాతీయ కార్యదర్శి డాక్టర్ విజ్జు కృష్ణన్ వెల్లడి
  •     అన్ని పంటల మద్దతు ధరకు చట్టబద్ధ హామీ ఇవ్వాలి

హైదరాబాద్, వెలుగు: దేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజ్జు కృష్ణన్ అన్నారు. సాగు ఖర్చులు పెరగడం, పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడం, అప్పుల భారం, ప్రకృతి వైపరీత్యాలతో రైతులు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

రైతులకు అండగా నిలిచే విధానాలను ప్రభుత్వాలు అమలు చేయాలని, అన్ని పంటలకూ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభల సందర్భంగా ప్రజానాట్యమండలి రచయితలు రాసిన పాటల సీడీని గురువారం హైదరాబాద్‌‌‌‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా విజ్జు కృష్ణన్ మాట్లాడుతూ దేశ ఆహార భద్రతకు వ్యవసాయం వెన్నెముకగా నిలుస్తున్నప్పటికీ, ఈ రంగంపై ఆధారపడిన రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల ఆదాయ పరిస్థితులు ఆశించిన స్థాయిలో లేవన్నారు. దేశ శ్రామిక శక్తిలో 46.1 శాతం మంది వ్యవసాయ, అనుబంధ రంగాలపై ఆధారపడుతుండగా, జాతీయ ఆదాయంలో ఈ రంగాల వాటా దాదాపు ఐదో వంతుకే పరిమితమవుతోందని పేర్కొన్నారు. 

సాగు పెట్టుబడులు ఏటా పెరుగుతున్నా రైతులకు పంటల అమ్మకంలో తగిన ఆదాయం రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు కేంద్రం ప్రకటించిన ధర లభించేలా చట్టబద్ధ రక్షణ కల్పించాలని చెప్పారు. ఉత్పత్తి సమగ్ర ఖర్చుపై 50 శాతం లాభం కలిపి అన్ని పంటలకూ మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. 

కౌలు రైతులకు రుణాలు, పంటల బీమా, నష్టపరిహారం, ప్రభుత్వ పథకాలు అందించాలని కోరారు. సాగు చేస్తున్న రైతుకే ప్రభుత్వ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి మూడ్ శోభన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు, సహాయ కార్యదర్శి ఉడుత రవీందర్, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వినోద్, కట్ట నరసింహ తదితరులు పాల్గొన్నారు.