- తెలంగాణ నుంచి కాంగ్రెస్ క్యాడర్ క్యూ
- శనివారం ఆగ్రాలో టిఫిన్, అదేరోజు రాత్రి ఢిల్లీకి
- ఫ్లైట్లు, ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్న ముఖ్యనేతలు
హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల 1న ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ నిరసన సభకు తెలంగాణ నుంచి పార్టీ క్యాడర్ క్యూ కట్టారు. సర్‌కు వ్యతిరేకంగా, సీఈసీజ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో రాంలీలా మైదానంలో హైకమాండ్ నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీ, సభకు తెలంగాణ నుంచి కనీసం 15 వేల మందిని ప్రత్యేక రైళ్లలో తరలించాలని పీసీసీ నాయకత్వం ప్లాన్ చేసింది. అయితే తీరా సమయానికి రైల్వే శాఖ స్పెషల్ ట్రైన్లు ఇవ్వలేమని తేల్చి చెప్పడంతో ప్రత్యామ్నాయంగా రోడ్డు మార్గంలో క్యాడర్‌ను ఢిల్లీ సభకు తరలించాలని పీసీసీ నాయకత్వం నిర్ణయించింది. దీంతో ప్రతి జిల్లాకు తగినన్ని బస్సులను పంపించి, ఢిల్లీకి తరలిస్తున్నారు. మొత్తం 150 బస్సుల్లో సుమారు ఐదు నుంచి ఆరు వేల మంది పార్టీ కార్యకర్తలు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాల వారీగా వీటిని మంత్రులు పర్యవేక్షిస్తుండగా, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జీలు పార్టీ కార్యకర్తలను సమన్వయం చేస్తున్నారు.
వంద కార్లతో మైనంపల్లి రోహిత్
గురువారం సాయంత్రం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో వంద కార్లలో పెద్ద సంఖ్యలో క్యాడర్ ఢిల్లీ బాట పట్టారు. క్యాడర్ వెంట మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కూడా వెళ్తున్నారు. దీంతో క్యాడర్ జోష్‌తో ఢిల్లీకి బయల్దేరారు. ఇక సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నాయకత్వంలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం తెల్లవారుజామున 15 బస్సుల్లో ఢిల్లీ బాట పట్టారు. పీసీసీ నాయకత్వం వివిధ జిల్లాలకు పంపించిన బస్సులు పార్టీ కార్యకర్తలతో శుక్రవారం తెల్లవారుజామున బయల్దేరి మధ్యాహ్నానికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంటాయి. అక్కడ భోజనం చేసి రాత్రికి నాగ్‌పూర్ చేరుకోనున్నారు. అక్కడ బస చేసి శనివారం తెల్లవారేసరికి ఆగ్రా చేరుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్ చేసుకుని అదేరోజు రాత్రి వరకు ఢిల్లీ చేరుకోనున్నారు.
వారికి కేటాయించిన గదుల్లో రాత్రి బస చేసి ఆదివారం రాంలీలా మైదానంలో జరిగే కాంగ్రెస్ సభలో వేలాది మంది పార్టీ కార్యకర్తలు పాల్గొననున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, మరికొందరు మంత్రులు, పార్టీ ఎంపీలు ఢిల్లీలోనే ఉన్నారు. మిగిలిన మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు శుక్రవారం ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సుమారు 5 వేల మంది వరకు ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు ఇప్పటికే విమాన టికెట్లు బుక్ చేసుకోగా, చాలా మంది జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతలు ముందుగానే అందుబాటులో ఉన్న ట్రైన్లలో టికెట్లు బుక్ చేసుకున్నారు. దీంతో శుక్రవారం రాత్రి వరకు మెజార్టీ పార్టీ నేతలు ఢిల్లీకి చేరుకోనున్నారు. శని, ఆదివారాలు తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీలోనే ఉండనున్నారు. ఢిల్లీ సభను కాంగ్రెస్ హైకమాండ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతోనే తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో క్యాడర్‌ను ఈ సభకు తరలించడంపై ఫోకస్ పెట్టారు. జన సమీకరణ కోసం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాశ్ పాండేను తెలంగాణకు అబ్జర్వర్‌గా నియమించగా, ఆయన వరుస సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఢిల్లీలో వసతి కోసం ఐదుగురితో కమిటీ
ఇక్కడి నుంచి వేల సంఖ్యలో వచ్చే పార్టీ కార్యకర్తలకు భోజనం, బస వంటి వసతుల కోసం పీసీసీ నాయకత్వం ఐదుగురితో కమిటీ వేసింది. ఇందులో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్ ఉన్నారు. అయితే స్పెషల్ ట్రైన్లు ఇవ్వమని రైల్వే అధికారులు చివరి క్షణంలో చెప్పడంతో అనుకున్న స్థాయిలో పార్టీ క్యాడర్‌ను ఢిల్లీకి తరలించేందుకు పీసీసీ నాయకత్వం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. 15 వేల మందిని తరలించాలని టార్గెట్‌గా పెట్టుకోగా, స్పెషల్ ట్రైన్లు లేకపోవడంతో బస్సులే దిక్కయ్యాయి. దీంతో కనీసం 6 వేల నుంచి 8 వేల మంది వరకు తరలిస్తున్నట్లు పీసీసీ నేతలు చెబుతున్నారు.
