ముంబై: నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడాన్ని అరికట్టేందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తోంది. ఇందులో భాగంగా మహిమ్ ప్రాంతంలో అత్యాధునిక ఏఐ కెమెరాలను ఏర్పాటు చేసి, చెత్త వేసేవారిని గుర్తించి వెంటనే లౌడ్ స్పీకర్ల ద్వారా హెచ్చరికలు జారీ చేసే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ముంబైలో చెత్త పేరుకుపోయే అత్యంత సమస్యాత్మక ప్రదేశాలలో ఒకటైన జీ/నార్త్ వార్డ్ పరిధిలోని డాక్టర్ రాయ్ కర్ మార్గ్ వద్ద గల గజానన్ వాటిక ప్రాంతంలో ప్రయోగాత్మకంగా స్మార్ట్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎవరైనా చెత్త వేయడానికి వస్తే, ఆ కెమెరాలు వెంటనే స్పందించి.. ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, చెత్త వేయవద్దని లౌడ్‌స్పీకర్ ద్వారా ఆడియో హెచ్చరికలు జారీ చేస్తాయి. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో రానున్న రోజుల్లో ముంబైలోని మరిన్ని కీలక ప్రాంతాల్లో ఈ ఏఐ- ఎనేబుల్డ్ కెమెరాలను ఏర్పాటు చేయాలని బీఎంసీ భావిస్తోంది.
