- రంగారెడ్డి జిల్లా కొత్తూరులో బాలిక మృతి కేసును ఛేదించిన పోలీసులు
షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్స్టేషన్పరిధిలో బాలిక మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఫోన్అతిగా వాడుతోందని, చెప్పిన మాట వినడం లేదన్న కారణాలతో తల్లే.. తన కూతురిని గొంతునులిమి చంపేసిందని తేల్చారు. షాద్‌నగర్ జోన్ డీసీపీ శిరీష గురువారం సంబంధిత వివరాలను వెల్లడించారు. కొత్తూరులోని హనుమాన్ టెంపుల్ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ ముయ్యాది రాజు–విజయలక్ష్మి దంపతుల కుమార్తె సువర్ణ అలియాస్లవ్లీ(14) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ నెల 27న ఆమె ఇంట్లో ఉరేసుకున్న స్థితిలో కనిపించడంతో కుటుంబసభ్యులు తొలుత కొత్తూరులోని దవాఖానకు, అక్కడి డాక్టర్ల సూచన మేరకు షాద్‌నగర్ గవర్నమెంట్హాస్పిటల్కు తరలించారు.
అయితే, అప్పటికే బాలిక మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహానికి ఉస్మానియా దవాఖానలో పోస్టుమార్టం నిర్వహించగా.. గొంతు నులమడం వల్ల చనిపోయిందని రిపోర్ట్వచ్చింది. దీంతో షాద్‌నగర్ డివిజన్ ఏసీపీ పి.లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో కొత్తూరు పోలీసులు ఈ కేసును హత్య కేసుగా మార్చి, దర్యాప్తు వేగవంతం చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ నెల 27న సాయంత్రం ఇంట్లో తల్లి విజయలక్ష్మి, కూతురు సువర్ణ మధ్య గొడవ జరిగింది. కోపంలో విజయలక్ష్మి తన కుమార్తె గొంతు నులమడంతో ఆమె చనిపోయింది. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు విజయలక్ష్మి సువర్ణ మెడకు చీర కట్టి ఉరేసింది. తర్వాత కూరగాయలు కొనుగోలు చేయడానికి బయటకు వెళ్లింది. తిరిగొచ్చి, తన కూతురు ఆత్మహత్య చేసుకుందని కేకలు వేసింది. నిందితురాలని గురువారం అరెస్ట్చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు.
