- ఎమ్మెల్సీ ఎన్నికల్లో 28 స్థానాలు బీజేపీనే గెలిచినట్లు ట్వీట్
- కాంగ్రెస్ పార్టీ సున్నా చుట్టేసిందని సెటైర్లు
- ముందు వెనక చూసుకోకుండా ఎద్దేవా చేసిన ఫడ్నవీస్, హిమంత
- నాగ్‌పూర్, వారణాసి ఫలితాలు రాగానే ట్వీట్లు డెలీట్ చేసిన నేతలు
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల విషయంలో తొందరపడి కామెంట్ చేసి ప్రధాని నరేంద్ర మోదీ ఇరుకునపడ్డారు. కాంగ్రెస్‌పై సెటైర్లు వేయబోయి అభాసుపాలయ్యారు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, కర్నాటక రాష్ట్రాల్లోని 28 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి బుధవారం ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే మోదీ 'ఎక్స్'వేదికగా కాంగ్రెస్ పార్టీపై ముందు వెనుక చూసుకోకుండా సెటైర్లు వేశారు.
అయితే, ఆ సంతోషం 2 గంటలు కూడా నిలవలేదు! ఎన్నికల్లో కొన్ని చోట్ల బీజేపీకి తగిలిన ఎదురుదెబ్బలు చూసి..తన పరువు కాపాడుకోవడానికి ఆ పోస్ట్‌ను వెంటనే డిలీట్ చేశారు. ఆయన బాటలో నడిచిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా నాలుక కరుచుకుని ఎక్స్‌లో పెట్టిన పోస్టులను తొలగించారు.
అసలేమైందంటే..!
నాలుగు రాష్ట్రాల్లోని 28 ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు జరిగాయి. అయినా, కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలవలేక "సున్నా" చుట్టేసిందని మోదీ తన పోస్ట్‌లో ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎన్ని స్థానాలు గెలుచుకుందో చూడండి అంటూ.. ఎన్డీయే కూటమి సాధించిన విజయాలపై తెగ సంబరపడిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 28 స్థానాలూ బీజేపీనే గెలిచిందని తెలిపారు.
ఈవీఎంల మీద పదే పదే ఏడుస్తున్న కాంగ్రెస్‌కు బ్యాలెట్లలోనూ ఇదే గతి పట్టిందని ప్రధానితో పాటు బీజేపీ శ్రేణులు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలుపెట్టాయి. కానీ, ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఫలితాలు పూర్తిగా బయటికి వచ్చేసరికి బీజేపీకి గట్టి షాక్‌లు తగిలాయి. కాంగ్రెస్ ఒక్క స్థానమూ గెలవలేదన్న మోదీ లెక్కలు తలకిందులయ్యాయి.
సరిగ్గా ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగ్‌పూర్‌లోనే కాంగ్రెస్ అభ్యర్థి అభిజిత్ వంజారి ఘన విజయం సాధించారు. అంతకంటే ముఖ్యంగా, స్వయంగా ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలోనూ బీజేపీకి ఘోర పరాజయం ఎదురైంది. అక్కడ సమాజ్‌వాదీ పార్టీ రెండు స్థానాలను కైవసం చేసుకుని బీజేపీని చావుదెబ్బ కొట్టింది. దీంతో కాంగ్రెస్‌ను ఎద్దేవా చేద్దామని పెట్టిన 'ఓవర్ కాన్ఫిడెన్స్' ట్వీట్ కాస్తా ప్రధాని మోదీ, ఫడ్నవీస్, హిమంత మెడకే చుట్టుకుంది.
నాగ్‌పూర్, వారణాసి ఫలితాలు బయటికి రాగానే సోషల్ మీడియాలో నెటిజన్లు, విపక్షాలు ముగ్గురిని ఏకిపారేయడం మొదలుపెట్టాయి. "ఇతరులను ఎద్దేవా చేద్దామనుకుంటే మీ కంచుకోటలే కరిగిపోయాయిగా!" అంటూ సెటైర్లు వేశారు. పరిస్ధితి చేయి దాటిపోవడంతో, పరువు పోకుండా ఉండేందుకు ప్రధాని మోదీ, ఫడ్నవీస్, హిమంత తమ ట్వీట్‌ను కేవలం రెండు గంటల వ్యవధిలోనే డిలీట్ చేయాల్సి వచ్చింది.
